•అపోహలు తొలగించాలని అధికారులకు సూచన
•‘పానిక్ బుకింగ్’ వల్లే సమస్యలంటున్న ఏజెన్సీలు..
•మూడు నాలుగు రెట్లు బుకింగ్లు
పెరిగినట్టు వెల్లడి
•సీఎస్, సివిల్ సప్లయ్స్ కమిషనర్ నేతృత్వంలో హైలెవల్ కమిటీ
హైదరాబాద్‌లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు.
BB6 TELUGU NEWS CHANNEL
తెలంగాణ రాష్ట్రంలో ఎల్పీజీ సిలిండర్లకు ఎలాంటి కొరత లేదని, ప్రజలు ఆందోళన చెందొద్దని సివిల్ సప్లయ్స్ మినిస్టర్ ఉత్తంకుమార్ రెడ్డి స్పష్టం చేశారు. సోషల్ మీడియా ప్రచారం కారణంగా ప్రజలు అవసరానికి మించి సిలిండర్లు బుక్ చేయడం వల్లే సరఫరా వ్యవస్థపై ఒత్తిడి పెరిగిందని అన్నారు.
గ్యాస్ కొరత నెలకొంటుందన్న అపోహలను తొలగించాలని కలెక్టర్లు,పోలీసు అధికారులకు సూచించారు.శుక్రవారం సెక్రటేరియెటన్నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎస్ రామకృష్ణారావు,సివిల్ సప్లయ్స్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రతో కలిసి కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని బాట్లింగ్ ప్లాంట్లలో సరిపడా గ్యాస్ నిల్వలు ఉన్నాయని, డొమెస్టిక్ వినియోగదారులకు ఇబ్బంది లేకుండా సిలిండర్ల సరఫరా కొనసాగుతుందన్నారు.
అక్రమాలకు పాల్పడితే లైసెన్స్ రద్దు చేస్తం
రాష్ట్రంలోని కొన్ని చోట్ల డొమెస్టిక్ సిలిండర్లను కమర్షియల్ అవసరాలకు వినియోగిస్తున్నట్టు అధికారులు గుర్తించారని, నల్గొండ, యాదాద్రి, ఖమ్మం తదితర జిల్లాల్లో ఇలా అక్రమంగా తరలించిన సిలిండర్లను సీజ్ చేసి కేసులు నమోదు చేశారని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 288 కేసులు నమోదు చేశారని, అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని,అవసరమైతే ఏజెన్సీల లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు.ప్రజలు భయాందోళనలకు గురై పానిక్ బుకింగ్లు చేయొద్దని.. పట్టణాల్లో 25రోజులకు ఒకసారి, గ్రామాల్లో 45రోజులకు ఒకసారి మాత్రమే బుకింగ్ చేసుకోవాలని సూచించారు. అత్యవసరసేవలైన ఆసుపత్రులు, విద్యాసంస్థలు,వృద్ధాశ్రమాలు, ప్రభుత్వ సంస్థలు,హోటల్స్ కు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు.
ఏదైనా సమస్య ఉంటే ఇండేన్, హెచ్పీ,భారత్ గ్యాస్ టోల్ ఫ్రీ నంబర్లకు ఫిర్యాదు చేయాలని, అక్రమాలు జరిగితే 1967కి కాల్ చేయాలన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో హైలెవల్ కమిటీ, జిల్లాల్లో కలెక్టర్, -ఎస్పీ నేతృత్వంలో జిల్లా కమిటీలు,హైదరాబాదులో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
పానిక్ బుకింగ్ తోనే సమస్య: ఏజెన్సీ నిర్వాహకులు రాష్ట్రంలో సాధారణంగా రోజుకు 2.30 లక్షల సిలిండర్లు సరఫరా అవుతున్నాయని,కోటి 29 లక్షల కనెక్షన్లకు 810 డిస్ట్రిబ్యూటర్ల ద్వారా సప్లై జరుగుతున్నదని ఏజెన్సీ నిర్వాహకులు తెలిపారు.
“కొరతకంటే పానిక్ బుకింగ్తోనే సమస్య.సాధారణంగా రోజుకు ఒక లక్ష బుకింగ్లు వచ్చేవి.ఇప్పుడు మూడు నాలుగు రెట్లు పెరిగి సర్వర్స్ మొరాయించాయి. ఫోన్ లైన్లు,యాప్లు స్తంభించిపోయాయి” అని పేర్కొన్నారు. కొరత లేక పోయినా భారీగా బుకింగ్లు రావడంతో సప్లైలతో జాప్యం జరుగుతున్నదని వివరించారు. రాష్ట్రంలోని గురుకుల విద్యాసంస్థలకు అవసరాలకుతగ్గట్టు సమయానికి గ్యాస్ సిలిండర్లు అందుతున్నాయన్నారు.
కట్టెల పొయ్యిల మీద ప్రసాదాల తయారీ వంట గ్యాస్ కొరతతో మెదక్ జిల్లాలోని ఏడుపాయల వన దుర్గాభవానీ మాత ఆలయంలో ప్రసాదాల తయారీకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆలయంలో మామూలుగా రోజుకు2,500 లడ్డూ లు, 1,500 పులిహోర ప్యాకెట్లు, ఆదివారాల్లో 8 వేల లడ్డూలు, 6వేల పులిహోర ప్యాకెట్లు తయారు చేస్తారు.ప్రసాదాల తయారీకి రోజుకు 3 సిలిండర్లు,ఆదివారాల్లో 8 సిలిండర్లు
అవసరమవుతాయి. రెండు, మూడు రోజులుగా అవసరమైనన్ని సిలిండర్లు సప్లై కావడం లేదు. దీంతో ఎండోమెంట్ అధికారులు శుక్రవారం నుంచి ప్రసాదాల తయారీకి కట్టెల పొయ్యిలను ఏర్పాటు చేశారు. సామిల్స్నుంచి కట్టెలు కొంటున్నారు. సిలిండర్ల సమస్య ఇలాగే కొనసాగితే ప్రసాదాల తయారీకి మరింత ఇబ్బంది అవుతుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.