BB6 TELUGU NEWS CHANNEL
హైదరాబాద్ కూకట్పల్లి లో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. JNTU పరిధిలో విద్యార్థులు రెండు గ్రూపులుగా విడిపోయి నడిరోడ్డుపై కొట్టుకున్నారు. సినిమా స్టైల్లో రాళ్లు, కర్రలతో పరస్పరం దాడులు చేసుకోవడంతో స్థానికంగా భయానక వాతావరణం నెలకొంది.
JNTU యూనివర్సిటీ పరిధిలోని ఫార్చ్యూన్ బిజినెస్ స్కూల్ వద్ద ఈ ఉద్రిక్త సంఘటన చోటుచేసుకుంది. అర్ధరాత్రి నుంచి విద్యార్థులు వీరంగం సృష్టించారు.ఈ రెండు గ్రూపులకు చెందిన విద్యార్థులంతా అదే కాలేజీ విద్యార్థులుగా తెలుస్తోంది. మొదట ఓ హోటల్లో పార్టీ చేసుకుంటుండగా వీరి మధ్య మాటా మాటా పెరిగి, అది కాస్తా పెద్ద గొడవకు దారితీసింది.
మొదట హోటల్ వద్దే గొడవకు దిగిన విద్యార్థులు ఆ తర్వాత మళ్లీ కాలేజీ వద్దకు వచ్చి గొడవపడ్డారు. ఈ సమయంలో తమ వెంట కర్రలు, రాళ్లు తెచ్చుకుని పరస్పర దాడులకు పాల్పడుతూ ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించారు.
నడిరోడ్డుపై రాళ్లు, కర్రలతో పరస్పర దాడులు చేయడంతో సంఘటనా స్థలంలో కొద్దిసేపు భయానక వాతావరణం ఏర్పడింది.
ఈ గొడవలో రోడ్డుపై వెళుతున్న ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకునేసరికి విద్యార్థులు పరారయ్యారు.
ఇటీవల JNTUH లోనే ఫస్ట్ ఇయర్ విద్యార్థులను కొన్ని వివాదాల్లోకి లాగుతున్నారని, 20 మందికి పైగా విద్యార్థులు పోలీస్ కేసుల్లో ఇరుక్కున్నారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.ప్రస్తుతం బాధిత మహిళ ఫిర్యాదుతో కూకట్పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గొడవకు కారకులైన విద్యార్థుల గురించి సమాచారం సేకరిస్తున్నారు. అర్ధరాత్రి పార్టీల పేరుతో విద్యార్థుల ఇలాంటి వీరంగం పై JNTU యాజమాన్యం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
కూకట్పల్లి JNTU పరిధిలో అర్ధరాత్రి విద్యార్థుల మధ్య భీకర ఘర్షణ – రాళ్లు, కర్రలతో దాడులు
04
Sep