BB6 TELUGU NEWS CHANNEL
10 రోజుల విదేశీ పర్యటనలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లండన్ లో పర్యటిస్తున్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కోసం ఢిల్లీ వెళ్లిన సీఎం, అక్కడి నుంచే నేరుగా బుధవారం అర్ధరాత్రి లండన్ కు బయలుదేరారు. ఈరోజు ఉదయం ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయాన్ని సీఎం రేవంత్ రెడ్డి సందర్శించారు.
తెలంగాణలో విద్యా వ్యవస్థను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన సాగుతోంది. ఆగస్టు 20 నుంచి 30 వరకు యూకే, అమెరికాలో పర్యటించనున్న సీఎం బృందం… విద్య, పరిశోధన, నైపుణ్యాభివృద్ధి, అంతర్జాతీయ సంస్థలతో సంబంధాల బలోపేతంపై దృష్టి సారించింది.

ఇందులో భాగంగా ఈరోజు ఉదయం లండన్ లోని ఆక్స్ ఫర్డ్ వర్సిటీలోని బ్లావట్నిక్ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ ను సీఎం సందర్శించారు. అక్కడి విద్యా విధానాలు, పాలనా సంస్కరణలు, లీడర్ షిప్ ప్రోగ్రామ్స్ పై అధికారులు, ప్రొఫెసర్లతో చర్చించారు.
గతంలోనే ఉస్మానియా యూనివర్సిటీని ఆక్స్ ఫర్డ్ స్థాయిలో అభివృద్ధి చేస్తామని, అందుకోసం రూ.1000 కోట్లు ఖర్చు పెట్టడానికైనా సిద్ధంగా ఉన్నామని సీఎం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ హామీకి అనుగుణంగానే… ఆక్స్ ఫర్డ్ మోడల్ ను ప్రత్యక్షంగా అధ్యయనం చేసి, ఓయూతో పాటు తెలంగాణలోని యూనివర్సిటీలలో అమలు చేయాలని సీఎం భావిస్తున్నారు.
ఈ సందర్భంగా తెలంగాణ విద్యార్థులకు ఆక్స్ ఫర్డ్ లో ఉన్నత విద్యా అవకాశాలు, ఫ్యాకల్టీ ఎక్స్ చేంజ్ ప్రోగ్రామ్స్, రీసెర్చ్ కొలాబరేషన్ పై చర్చలు జరిగినట్లు సమాచారం.
“తెలంగాణ విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడాలి. అందుకోసం ప్రపంచంలోని టాప్ యూనివర్సిటీలతో ఒప్పందాలు చేసుకుంటాం.”
ఆక్స్ ఫర్డ్ సందర్శన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి లండన్ లోని ఎమిరేట్స్ స్టేడియంలో ఫుట్ బాల్ ప్రజెంటేషన్ లో పాల్గొననున్నారు. రేపు 22న కేంబ్రిడ్జ్ బృందంతో సమావేశం, యూనివర్సిటీ ఆఫ్ లండన్ సెనేట్ హౌస్, లండన్ బిజినెస్ స్కూల్ సందర్శన ఉన్నాయి.
ఆగస్టు 23న లండన్ నుంచి అమెరికాలోని బోస్టన్ కు వెళ్లనున్న సీఎం… 24న హార్వర్డ్ యూనివర్సిటీ, ఎంఐటీ క్యాంపస్ లను సందర్శిస్తారు. 25న నార్త్ ఈస్టర్న్, వర్జీనియా టెక్ యూనివర్సిటీ బృందాలతో సమావేశం అయి, న్యూయార్క్ లో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ మీట్ అండ్ గ్రీట్ లో పాల్గొని 30న హైదరాబాద్ కు తిరిగి రానున్నారు.
మొత్తానికి విద్య, పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన ఈ విదేశీ పర్యటన తెలంగాణ ఉన్నత విద్యా రంగంలో కీలక మార్పులకు దారి తీస్తుందని భావిస్తున్నారు.
