యాదాద్రి జిల్లా భువనగిరిలో ఉద్రిక్తత – ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ పై బీజేపీ దాడి, బీజేపీ ఆఫీస్ పై కాంగ్రెస్ ప్రతీకార దాడి!

BB6 TELUGU NEWS CHANNEL
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం భువనగిరిలో రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది. కాంగ్రెస్, బీజేపీ శ్రేణుల మధ్య వివాదం ఘర్షణకు దారి తీసింది. ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

మంగళవారం ఉదయం భువనగిరి కాంగ్రెస్ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి క్యాంప్ కార్యాలయంపై బీజేవైఎం కార్యకర్తలు ఒక్కసారిగా దాడికి దిగారు. కార్యాలయంలోని అద్దాలు, పూలకుండీలను ధ్వంసం చేయడంతో పాటు ఫ్లెక్సీలు, నేమ్ బోర్డుపై నల్లరంగు చల్లారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్రస్థాయిలో నినాదాలు చేశారు.

ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై దాడి వార్త తెలుసుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతీకార చర్యలకు దిగారు. భువనగిరిలోని బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ శ్రేణులు దాడికి పాల్పడి, ఆఫీసులోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేశాయి.
ఈ క్రమంలో ఇరువర్గాలు పరస్పరం రాళ్లదాడికి దిగడంతో పరిస్థితి మరింత చేయిదాటింది. ఇరు పార్టీల నేతలు పోటాపోటీ నినాదాలతో హోరెత్తించారు. భువనగిరి పట్టణం ఒక్కసారిగా రణరంగంగా మారింది.

పోలీసుల రంగప్రవేశం:
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఘటనా స్థలాల్లో అదనపు బలగాలను మోహరించి ఆందోళనకారులను చెదరగొట్టారు. రెండు వైపులా దాడులకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.

ప్రస్తుతం భువనగిరిలో పరిస్థితి అదుపులో ఉన్నప్పటికీ, ఎప్పుడేం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. రాజకీయ కక్షలతో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.