రైస్ మిల్లర్లకు సీఎం రేవంత్ అల్టిమేటం – రూ.3960 కోట్లు కట్టకపోతే మిల్లులు సీజ్!

బకాయిలు కట్టకుంటే మిల్లులు స్వాధీనం – సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

BB6 TELUGU NEWS CHANNEL
తెలంగాణలో రైస్ మిల్లర్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ షాక్ ఇచ్చింది. ప్రభుత్వం ఇచ్చిన వడ్లను దారి మళ్లించి, బకాయిలు చెల్లించని మిల్లులను స్వాధీనం చేసుకుంటామని సీఎం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 3600 మిల్లుల్లో భారీ అవకతవకలు జరిగాయని సివిల్ సప్లైస్ శాఖ తేల్చింది.

తెలంగాణలో కస్టమ్ మిల్లింగ్ రైస్, అంటే సీఎంఆర్ కుంభకోణం రోజురోజుకీ పెద్దదవుతోంది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 59.96 లక్షల టన్నుల బియ్యం, అంటే రూ.13,399 కోట్ల విలువైన బియ్యం గల్లంతైనట్లు తేలింది. ఇందులో బీఆర్ఎస్ హయాంలోనే 51.98 లక్షల టన్నులు, రూ.11,304 కోట్ల అవకతవకలు జరిగాయి. కాంగ్రెస్ వచ్చిన రెండున్నరేళ్లలో మరో 7.98 లక్షల టన్నులు, రూ.2,095 కోట్లు బకాయిలు ఉన్నాయి.

ప్రస్తుతం 360 మందికి పైగా మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వీరు ప్రభుత్వం ఇచ్చిన వడ్లను అమ్మేసి, దాదాపు రూ.3,960 కోట్ల బకాయిలు ఎగ్గొట్టారని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఒక్కో మిల్లు రూ.1 కోటి నుంచి రూ.100 కోట్ల వరకు బకాయి పడింది. ఎక్కువ కేసులు కామారెడ్డి, నిజామాబాద్, నల్గొండ జిల్లాల్లోనే ఉన్నాయి.

“రైతుల కష్టాన్ని దోచుకుంటే ఊరుకోం. బకాయిలు కట్టని మిల్లర్లపై రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద చర్యలు తీసుకుంటాం. మిల్లులను స్వాధీనం చేసుకుని ప్రభుత్వమే నడుపుతుంది. రైతులను తక్కువ ధరకు మోసం చేస్తే బ్లాక్ లిస్ట్ లో పెడతాం.”సీఎం రేవంత్ రెడ్డి గతంలోనే రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగించి మిల్లులను సీజ్ చేయాలని ఆదేశించారు. రైతులను ఇబ్బంది పెట్టే మిల్లర్లు, ట్రేడర్లపై ఎస్మా చట్టం కింద కూడా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రభుత్వ విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి. మిల్లర్లు వడ్ల అమ్మకం ద్వారా వచ్చిన డబ్బును సినిమా నిర్మాణం, రియల్ ఎస్టేట్, కుటుంబ సభ్యుల పేర్లతో కొత్త మిల్లుల ఏర్పాటుకు మళ్లించారని ప్రాసిక్యూషన్ తెలిపింది. నిబంధనల ప్రకారం 15 రోజుల్లో బియ్యం తిరిగి ఇవ్వాలి కానీ 2022-23 నుంచి ఎగ్గొడుతున్నారని ప్రభుత్వం వాదిస్తోంది.
ప్రస్తుతం రూ.6,365 కోట్లు రికవరీ చేయగా, ఇంకా రూ.6,630 కోట్లకు పైగా రికవరీ పెండింగ్ లో ఉందని అధికారులు చెబుతున్నారు.
మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు – బకాయిలు కడతారా, మిల్లులు వదులుకుంటారా అని. రానున్న రోజుల్లో ఎన్ని మిల్లులపై సీజ్ నోటీసులు పడతాయో వేచి చూడాలి.