నేటి నుంచి మండల స్థాయిలో ప్రజావాణి.
రాష్ట్రవ్యాప్తంగా 620 మండలాల్లో ఏర్పాట్లు
ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 వరకు అర్జీల స్వీకరణ
BB6 TELUGU News CHANNEL
రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నుంచి మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది. ఈ మేరకు 620 మండలాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అర్జీలు స్వీకరించి, నమోదు చేయడంతోపాటు సంబంధిత రిజిస్ట్రేషన్ నంబరును సైతం అర్జీదారులకు అందజేస్తారు
ఎక్కడి సమస్యలు అక్కడే పరిష్కరించేలా
రాష్ట్రస్థాయి ప్రజావాణిలో ప్రతి వారం అర్జీలు పెరుగుతున్నాయి. వీటిలో 70 శాతం మండల స్థాయివే ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో మండలస్థాయికి ప్రజావాణిని విస్తరించి..అక్కడే సమస్యలు పరిష్కరించాలని నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మండలస్థాయి ప్రజావాణికి ఎంపీడీవోలను నోడల్ అధికారులుగా నియమించి..వారికి ఇటీవల హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో శిక్షణ ఇచ్చింది.
విస్తృత ప్రచారం..పకడ్బందీగా ఏర్పాట్లు
ప్రజావాణి నిర్వహణపై గ్రామాల్లో చాటింపు వేయడంతో పాటు సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం చేయాలని ప్రభుత్వం మార్గదర్శకాల్లో సూచించింది. రాష్ట్రంలో 152 మండల కేంద్రాల్లో సొంత భవనాలు లేవు. అద్దెభవనాల్లోనే అర్జీల స్వీకరణకు ఏర్పాట్లు చేయాలని సూచించింది. ప్రతి కార్యాలయంలో మౌలిక వసతులు తప్పనిసరి అని పేర్కొంది. ప్రజావాణి నిర్వహణకు డేటా ఎంట్రీ ఆపరేటర్లు/ హెల్ప్‌డెస్క్ ఆపరేటర్లకు శిక్షణ ఇవ్వడంతో పాటు ప్రతి వేదిక వద్ద కంప్యూటర్, స్కానర్, ఇంటర్నెట్ కనెక్టివిటీని సమకూర్చింది. ప్రజావాణి కార్యక్రమానికి ఎంపీడీవోలతో పాటు తహసీల్దార్, వ్యవసాయ, ఉద్యాన, విద్య, వైద్య, పశుసంవర్ధక, పంచాయతీరాజ్, విద్యుత్, మత్స్య, గృహనిర్మాణ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళా సంక్షేమ శాఖలు, అటవీ, అధికారులు, అంగన్వాడీ సూపర్వైజర్, స్థానిక ఎస్సైలు హాజరవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రజలు తమ సమస్య, చిరునామా, మొబైల్ నంబరును పేర్కొంటూ ఇచ్చే లిఖిత పూర్వక వినతులను స్వీకరించిన వెంటనే వాటి పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని, ప్రతి అర్జీని పోర్టల్‌లో నమోదు చేసి, రిజిస్ట్రేషన్ నంబరు ఇవ్వాలని పేర్కొంది. ఈ నంబరుతో ఫిర్యాదు స్థితిని ప్రజలు ట్రాక్ చేయొచ్చని తెలిపింది.
రైతు వేదికల్లోనూ మండల స్థాయి ప్రజావాణి కోసం పలు మండలాల్లోని రైతు వేదికలనూ ఉపయోగించుకోవచ్చని, దీనికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనుమతించారని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి తెలిపారు.