BB6 TELUGU NEWS CHANNEL
పాలమూరులో మిల్లర్ల గుట్టు రట్టు!
విజిలెన్స్ దాడుల్లో బయటపడ్డ భారీ స్కామ్!
వడ్లు లేవు.. బియ్యం లేవు.. రికార్డుల్లో మాత్రం కోట్లు!
ఉమ్మడి పాలమూరు జిల్లాలో రైస్ మిల్లర్ల ఆటలు బయటపడ్డాయి. ప్రభుత్వం పేదలకు పంచాల్సిన సన్న బియ్యం, సివిల్ సప్లైస్ కు ఇవ్వాల్సిన CMR బియ్యాన్ని పక్కదారి పట్టిస్తూ కోట్లు దండుకుంటున్న వ్యవహారం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల ఆకస్మిక తనిఖీల్లో వెలుగులోకి వచ్చింది. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల, నారాయణపేట జిల్లాల పరిధిలోని 500కు పైగా రైస్ మిల్లుల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి.

ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా గత వారం రోజులుగా విజిలెన్స్ అధికారులు మెరుపు దాడులు చేస్తున్నారు. ప్రభుత్వం నుండి రైతుల దగ్గర కొనుగోలు చేసిన వడ్లను కస్టమ్ మిల్లింగ్ కోసం మిల్లులకు కేటాయిస్తుంది. మిల్లర్లు ఆ వడ్లను మిల్లింగ్ చేసి తిరిగి ప్రభుత్వానికి CMR అంటే కస్టమ్ మిల్లింగ్ రైస్ గా ఇవ్వాలి. కానీ అనేక మిల్లుల్లో వడ్లు గానీ, బియ్యం గానీ లేవని అధికారులు గుర్తించారు.
తనిఖీల్లో అత్యంత కీలకమైన అంశం బయటపడింది. ట్రక్ షీట్లను పరిశీలిస్తే రైతుల పేర్లకు బదులు మిల్లు ఓనర్ల కుటుంబ సభ్యులు, బంధువుల పేర్లే ఉన్నాయి. అంటే వడ్లు కొనుగోలు కేంద్రం నుండి మిల్లుకు చేరినట్లు ఫేక్ రికార్డులు సృష్టించి, ఆ వడ్లను బహిరంగ మార్కెట్లో అధిక ధరకు అమ్ముకున్నట్లు ప్రాథమికంగా తేలింది. కొన్ని చోట్ల PDS బియ్యాన్ని పాలిష్ చేసి సన్న బియ్యంగా మార్చి అమ్ముతున్నట్లు కూడా విజిలెన్స్ గుర్తించింది.
2020 నుండి ఇప్పటివరకు ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే దాదాపు 148 మిల్లులను డీఫాల్ట్ గా గుర్తించినట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఈ కుంభకోణం విలువ రూ.600 కోట్లకు పైగా ఉంటుందని, కేవలం 7 రోజుల తనిఖీల్లోనే రూ.100 కోట్ల మేర వసూళ్లు జరిగాయని అధికారులు చెబుతున్నారు. గత రెండేళ్లుగా నిల్వ ఉండాల్సిన సన్న వడ్లు కూడా మిల్లుల్లో లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
ప్రభుత్వం ఇప్పటికే సీరియస్ గా తీసుకుంది. లెక్క తేలని ప్రతి క్వింటా బియ్యానికి జరిమానాతో పాటు క్రిమినల్ కేసులు తప్పవని హెచ్చరించింది. విజిలెన్స్ నివేదిక ఆధారంగా పలు మిల్లుల లైసెన్సులు రద్దు చేయడంతో పాటు బ్లాక్ లిస్ట్ లో పెట్టేందుకు సివిల్ సప్లైస్ శాఖ రంగం సిద్ధం చేస్తోంది. పాలమూరులో మొదలైన ఈ తనిఖీలు రాష్ట్రంలోని మిల్లర్లందరికీ హెచ్చరిక లాంటిదని చెప్పవచ్చు.
మొత్తానికి పేదల నోటికాడి బియ్యాన్ని కొట్టేసి కోట్లు వెనకేస్తున్న మిల్లర్ల భరతం పట్టేందుకు ప్రభుత్వం దూకుడు పెంచింది. ఈ తనిఖీలు ఇంకా ఎంతమంది మిల్లర్లను బోనులో నిలబెడతాయో వేచి చూడాలి.