ఉద్యోగులకు షాక్.. అనుమతి లేకుండా సెలవుపై వెళితే ఉద్యోగానికే ఎసరు!

BB6 TELUGU NEWS CHANNEL
విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ, ముందస్తు అనుమతి లేకుండా కేవలం లీవ్ లెటర్ సమర్పించి విధులకు గైర్హాజరయ్యే ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులు ఇక తమ ప్రవర్తనను మార్చుకో వాల్సిందే. లేని పక్షంలో ఇబ్బందులు తప్పవు.. పని తీరులో పారద‌ర్శకత, బాధ్యతారాహిత్యానికి చెక్ పెట్టే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా తెలంగాణ సివిల్ సర్వీసెస్ (క్లాసిఫికేషన్, కంట్రోల్ అండ్ అప్పీల్) రూల్స్, 1991లోని రూల్ 9, రూల్ 25 లకు అత్యంత కీలకమైన సవరణలు చేస్తూ సాధారణ పరిపాలన శాఖ జీవో నంబర్ 9ని జారీ చేసింది. జనవరి 23న జారీ అయిన ఈ ఉత్తర్వులు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి..*


*సర్వీస్ బ్రేక్‌గా పరిగణించి..*

*ఒక ఉద్యోగి ముందస్తు అనుమతి లేకుండా లేదా లీవ్ మంజూ రు కాకుండా విధులకు గైర్హాజరైతే ఆ కాలాన్ని డైస్-నాన్‌గా పరిగణించే ఉత్తర్వులు రాష్ట్రంలో ఎప్పటి నుంచో అమల్లో ఉన్నాయి. డైస్-నాన్‌గా ప్రకటించిన కాలానికి వేతనం చెల్లించరు. సర్వీస్‌గా పరిగణించరు. వార్షిక ఇంక్రిమెంట్లు, సెలవులు, పెన్షన్ మంజూ రుకు సైతం ఆ పీరియడ్‌ని మినహాయించి సర్వీస్ బ్రేక్‌గా పరిగణిస్తారు. తాజాగా జీవో 9తో మరిన్ని కఠిన నిబంధనలు తీసుకొచ్చారు. అనధికారికంగా విధులకు గైర్హాజరైన వారితో పాటు గడువు ముగిసినా ఫారిన్ సర్వీస్‌ డిప్యూటేషన్‌పై కొనసాగే ఉద్యోగులపై ఇకపై కఠిన చర్యలు ఉంటాయి. ముందస్తు అనుమతి లేకుండా దీర్ఘకాలం గైర్హాజరైతే ఏకంగా ఉద్యోగమే ఊడుతుంది.*


*ఉద్యోగానికి ముప్పు తెచ్చే పరిస్థితులు ఇవే!*

*ప్రభుత్వం విడుదల చేసిన జీవో 9 ప్రకారం, మూడు సందర్భాల్లో ఏ ఒక్కటి ఎదురైనా సదరు ఉద్యోగి కొలువును శాశ్వతంగా కోల్పోతాడు.. మొదటి కారణం… ఉన్నతాధికారుల నుండి లీవ్ మంజూరు చేయించుకోకుండా లేదా ముందస్తు అనుమతి పొందకుండా వరుసగా ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం విధులకు గైర్హాజరైన ఉద్యోగిని ఎటువంటి మినహా యింపులు లేకుండా నేరుగా ఉద్యోగం నుంచి తొలగిస్తారు.. ఇక రెండవ కారణం.. ఉద్యోగికి సెలవు మంజూరైనా, కాకపోయినా వరుసగా ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం పాటు విధులకు దూరంగా ఉంటే సర్వీస్ నుంచి రిమూవ్ చేస్తారు. పరిమితికి మించి ఫారిన్ సర్వీస్ డిప్యూటేషన్‌పై ‌కొనసాగడం మూడో కారణం. రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిన ‌పీరియడ్‌కి మించి ఫారిన్ సర్వీస్ డిప్యూటేషన్‌పై కొనసాగే ఉద్యోగిని సర్వీస్ నుంచి శాశ్వతంగా తొలగిస్తారు..*


*నోటీస్ ఇచ్చిన తర్వాతే చర్యలు!*

*తాజా నిబంధనలు కఠినంగా ఉన్నప్పటికీ, సహజ న్యాయ సూత్రాలను పాటించి ఉద్యోగి తన వాదనను లిఖిత పూర్వకంగా సమర్పించడానికి అనుమతిస్తారు.. ఆ తర్వాతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు. ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హా జరైన ఉద్యోగులతో పాటు నిర్దేశించిన గడువు ముగిసినా ఫారిన్ సర్వీస్‌ డిప్యూటేషన్‌పై కొనసాగే ఉద్యోగులకు ముందుగా షోకాజ్ నోటీస్ జారీ చేస్తారు.. ఉద్యోగులు సమర్పించే సంజాయిషీని పరిశీ లించి సమగ్ర విచారణ జరిపిన తర్వాతే క్రమశిక్షణ చర్యలపై అధికారులు తుది నిర్ణయం తీసుకుంటారు.. ఉద్యోగి గైర్హాజరును తీవ్రమైన దుష్ప్రవర్తనగా పరిగణించనున్నట్లు ప్రభుత్వం జీవోలో స్పష్టంగా పేర్కొంది.*


*అనుమతి పొందాల్సిందే!*

*స్వల్ప కారణాలతో సుదీర్ఘ కాలం పాటు ముందస్తు అనుమతి లేకుండా కేవలం సెలవు దరఖాస్తు సమర్పించి విధులకు గైర్హా జరయ్యే ఉద్యోగ, ఉపాధ్యాయులు తమ ధోరణిని మార్చుకోకపోతే ఇబ్బందులు తప్పవు.. నిబంధనల ఉల్లంఘనను, ఉద్యోగుల గైర్హాజరీని ఇకపై ఎంతమాత్రం ఉపేక్షించబోమని ఈ జీవో ద్వారా ప్రభుత్వం స్పష్టమైన, కఠినమైన హెచ్చరికలు జారీ చేసింది. అనుమతి లేకుండా ఉద్యోగులు సెలవుపై వెళ్లడం తీవ్ర అనర్థాలకు దారితీస్తుంది. కేవలం లీవ్ లెటర్ సమర్పించి సెలవు వినియోగించు‌కోవడం ఎంత మాత్రం తగదు.. ముందుగా మంజూరు చేయించుకొని లేదా అనుమతి పొందిన తర్వాతే లీవ్‌పై వెళ్లాలి. ఇవేవీ చేయకుండా ఇష్టారాజ్యంగా విధులకు గైర్హాజరైతే, ఏళ్లకు ఏళ్లు కష్టపడి సంపాదించుకున్న ఉద్యోగాన్ని చేతులారా పోగొ ట్టుకోవాల్సి వస్తుంది. ఉద్యోగ, ఉపాధ్యాయులు తాజా జీవోకు అనుగుణంగా నడుచుకోవడం మంచిది.

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe