వాయుగుండం కాదిది వాయు’గండం’.. ప్రచండ గాలులతో ఈ ప్రాంతాల్లో అల్లకల్లోలమే

BB6 TELUGU NEWS CHANNEL
తెలుగు రాష్ట్రాల్లో ఈ వారం వర్షాల తీవ్రత తక్కువగా ఉంటుందట… ఇదే సమయంలో బలమైన ఈదురుగాలులు బీభత్సం సృష్టించే అవకాశాలున్నాయని వాతావరణ శాఖలు హెచ్చరిస్తున్నాయి.

Strong Wind Alert : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారిన విషయం తెలిసిందే. ఇది ఒడిశాలో తీరం దాటినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలేమీ ఉండవట… కానీ ఈదురుగాలుల బీభత్సం ఉంటుందని హెచ్చరిస్తున్నారు వాతావరణ నిపుణులు. తీరప్రాంతాల్లో మరింత బలమైన ఈదురుగాలులు వీస్తూ ప్రమాదకరంగా మారే అవకాశాలున్నాయి… కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

ఉత్తర తెలంగాణ జిల్లాల్లో గత కొంతకాలంగా కురుస్తున్న వర్షాలు తగ్గుముఖం పట్టాయి. ఇదే సమయంలో ఈ జిల్లాలకు ఈదురుగాలుల ప్రమాదం పొంచివుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో (జూలై 7-11 వరకు) ఈదురుగాలులు వీస్తాయని ప్రకటించింది. రేపు (మంగళవారం) ఈ జిల్లాల్లో 50-60 కిలోమీటర్లు వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. మిగిలిన జిల్లాల్లోనూ 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయంటోంది.

హైదరాబాద్ లో గాలి బీభత్సం…
తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో కూడా ఈదురుగాలుల బీభత్సం తప్పదట. ఇప్పటికే గాలి వేగం పెరిగి ప్రమాదాలు జరుగుతున్నాయి… దీని తీవ్రత మరింత పెరగనుందన్న హెచ్చరికలు కంగారు పెడుతున్నాయి. ఈదురుగాలుల దెబ్బకు అసెంబ్లీ ప్రాంగణంలోని భారీ చెట్టు కూలింది… ఆ సమయంలో చెట్టు కింద ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది.

బలమైన ఈదురుగాలులతో ప్రమాదాలు జరిగే అవకాశాలుంటాయి కాబట్టి నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా రోడ్డుపక్కన ఉండే పెద్దపెద్ద హోర్డింగ్స్, కటౌట్లు, చెట్లు, విద్యుత్ స్తంబాలతో ఎక్కువగా ప్రమాదం ఉంటుంది… కాబట్టి ప్రయాణాల సమయంలో జాగ్రత్తగా ఉండాలంటోంది. విద్యుత్ తీగలు తెగిపడే ఆస్కారం ఉంటుంది.

ఆంధ్ర ప్రదేశ్ లో ఈదురుగాలుల అలజడే..
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం గంటకు 12 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ-వాయువ్య దిశగా కదిలి బాలాసోర్(ఒడిశా) సమీపంలో తీరాన్ని దాటిందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఇది రాబోయే 24 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా ఉత్తర ఒడిశా, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ జార్ఖండ్, ఉత్తర ఛత్తీస్‌గఢ్ మీదుగా కదిలే అవకాశం ఉందని తెలిపారు.

తీరందాటిన ఈ వాయుగుండం ప్రభావంతో మంగళవారం (07-07-2026) శ్రీకాకుళం జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది. మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తీరం వెంబడి గంటకు 40-50 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.. కాబట్టి ఆ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రఖర్ జైన్ సూచించారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో నిన్న (సోమవారం) విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పల్నాడు జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిశాయని APSDMA ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఒకటిరెండు చోట్ల భారీ వర్షాలు కూడా పడ్డాయని వెల్లడించారు.

Related News

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe