మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో జరిగిన కరాటే పోటీలో సత్తా చాటిన వెన్నచేడ్ బాలికలు

BB6 TELUGU News CHANNEL
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో శ్రీ హనుమాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా వారు నిర్వహించిన ఐదవ జాతీయ కరాటే, టైక్వాండో పోటీల్లో గండీడ్ మండలం వెన్నచేడ్ బాలుర ఉన్నత పాఠశాల బాలికలు సత్తా చాటారు. జాతీయ స్థాయి పోటీలో ప్రథమ స్థానంలో నిలిచి తమ గ్రామానికి, పాఠశాలకు ఘన కీర్తిని తీసుకొచ్చారు.

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఇటీవల 5వ జాతీయ స్థాయి కరాటే మరియు టైక్వాండో పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ పోటీలకు రాష్ట్రం నలుమూలల నుంచి వందలాది మంది విద్యార్థులు హాజరయ్యారు.

ఈ జాతీయ పోటీల్లో గండీడ్ మండలం వెన్నచేడ్ గ్రామానికి చెందిన బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థినులు అద్భుత ప్రతిభ కనబరిచారు. ఆ పాఠశాలకు చెందిన హర్షిత, గాయత్రి, వైష్ణవి లు తమ ప్రత్యర్థులపై పైచేయి సాధించి ప్రథమ స్థానంలో నిలిచారు. వారి ప్రతిభకు గాను నిర్వాహకులు వారికి వైట్ బెల్ట్ ను అందజేసి ఘనంగా సత్కరించారు.

చిన్న గ్రామం నుంచి వచ్చి జాతీయ స్థాయిలో రాణించడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆడపిల్లలు చదువులోనే కాదు.. ఆత్మరక్షణ విద్యలైన కరాటే లాంటి వాటిలో కూడా రాణిస్తున్నారని ఉపాధ్యాయులు అంటున్నారు.

ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవి బాబు మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో ప్రథమ స్థానం సాధించిన హర్షిత, గాయత్రి, వైష్ణవి లను ప్రత్యేకంగా అభినందించారు. వారి విజయం పాఠశాలలోని ఇతర విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

ఈ విజయం వెనుక వారికి శిక్షణ ఇచ్చిన కరాటే మాస్టర్ కృషి, తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో ఉందని పాఠశాల యాజమాన్యం తెలిపింది.

మొత్తానికి మారుమూల గ్రామమైన వెన్నచేడ్ విద్యార్థినులు జాతీయ వేదికపై తమ ప్రతిభను చాటి.. తెలంగాణ పరువును నిలబెట్టారు.