BB6 TELUGU NEWS CHANNEL
హైదరాబాద్, అక్టోబర్ 29:
ఎల్-నినో ప్రభావంతో రాబోయే కరువు ముప్పు, బహిరంగ మార్కెట్లో నిత్యవసర ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది.
ప్రస్తుతం రేషన్ దుకాణాల ద్వారా ప్రతి లబ్ధిదారుడికి నెలకు 6 కిలోల చొప్పున సన్నబియ్యం మాత్రమే ఇస్తున్న ప్రభుత్వం, ఇకపై అదనంగా ఆరు రకాల నిత్యవసర సరుకులు ఇవ్వాలని యోచిస్తోంది.
ఆరు రకాల సరుకులు ఏవి?
పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమీక్షలో ప్రాథమికంగా ఈ 6 వస్తువులను పరిశీలిస్తున్నారు:
కందిపప్పు (Pigeon Peas)
గోధుమ పిండి (Wheat Flour)
పామాయిల్ (Palm Oil)
చక్కెర / పంచదార (Sugar)
చింతపండు (Tamarind)
కారం పొడి (Chilli Powder)
అధికారిక వర్గాల సమాచారం ప్రకారం ఈ జాబితాపై కసరత్తు జరుగుతోంది.
ఎప్పటి నుంచి మొదలవుతుంది?
అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే సంక్రాంతి (జనవరి 2026) నుంచి ఈ పథకాన్ని అమలు చేసే అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది.
అయితే ఇది యాసంగి సాగు పరిస్థితులు, మరో రెండు నెలల వాతావరణ అంచనాలపై ఆధారపడి ఉంటుందని సమాచారం.
లబ్ధిదారులు ఎంతమంది?
రాష్ట్రంలో ప్రస్తుతం 1.06 కోట్ల ఆహార భద్రత కార్డులు ఉండగా, దాదాపు 3.42 కోట్ల మంది లబ్ధిదారులు లబ్ధి పొందుతున్నారు. వీరికి ప్రతినెలా 2.18 లక్షల టన్నుల బియ్యం అవసరం అవుతోంది.
అధికారిక స్థితి ఏమిటి?
అక్టోబర్ 20న సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సివిల్ సప్లైస్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. లబ్ధిదారుల అవసరాలు, సేకరణ ఏర్పాట్లు, ప్రభుత్వంపై పడే ఆర్థిక భారంపై సమగ్ర ప్రతిపాదన తయారు చేయాలని ఆదేశించారు.
బడ్జెట్, లాజిస్టిక్స్ అంశాలు ఒక కొలిక్కి వచ్చాక కేబినెట్ తుది నిర్ణయం తీసుకుంటుంది. ప్రస్తుతం రాష్ట్ర గోదాముల్లో 9.64 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం బఫర్ స్టాక్ ఉందని, మరో 18.39 లక్షల టన్నులు రానున్నాయని, ఇది 2027 సెప్టెంబర్ వరకు సరిపోతుందని అధికారులు వెల్లడించారు.
తెలంగాణలో పేదలకు పండగే.. రేషన్ బియ్యంతో పాటు 6 వస్తువులు ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు
29
Oct