హైదరాబాద్ లో పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ – త్వరగా పనులు ప్రారంభించాలని సీఎం ఆదేశం

BB6 TELUGU NEWS CHANNEL
భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా కోర్ (CORE) పరిధిలో ప్రజా రవాణా సదుపాయాలను మెరుగుపరచాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కోర్ పరిధిలో ప్రజా రవాణా మెరుగుదల, రహదారుల అనుసంధానం, రీసైకిల్డ్ వాటర్ వినియోగంపై ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

హైదరాబాద్ నగరంలో రద్దీ అధికంగా ఉండే ప్రాంతాల్లో పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ (PRT) సిస్టమ్ ఏర్పాటుపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు.

జనసమ్మర్థం ఎక్కువగా ఉండే ప్రాంతాలతో పాటు, వివిధ పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు, ఉద్యోగులు ప్రయాణించే మార్గాలను మెట్రో, ఎంఎంటీఎస్, బస్ స్టేషన్లతో అనుసంధానించేలా పీఆర్టీని డిజైన్ చేయాలని సూచించారు. ప్రపంచంలోని అత్యుత్తమ పీఆర్టీ వ్యవస్థలపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని, సాధ్యమైనంత త్వరగా పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యమైన కాలనీల ఎంపిక, అత్యాధునిక సాంకేతికత, నిర్వహణ అంశాలకు పెద్దపీట వేయాలన్నారు.

కోర్ పరిధిలోని వివిధ ప్రాంతాల మధ్య అనుసంధానం పెరిగేలా, రహదారుల్లో ట్రాఫిక్ సజావుగా సాగేలా ఫ్లైఓవర్లు, అండర్ పాస్ ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు.

కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే విధానం ద్వారా ట్రాఫిక్ మరింత సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే అమలు, వివిధ కాలనీలు, రహదారుల నుంచి వచ్చే మార్గాలు కలిసే చోట్ల ఫ్రీ లెఫ్ట్, యూటర్న్ ల విషయంలో తీసుకుంటున్న చర్యలను అధికారులు వివరించారు. యుటిలిటీస్ తరలింపును వేగవంతం చేసి పనులు త్వరగా పూర్తి చేయాలని, నాగార్జున సర్కిల్ నుంచి జూబ్లీ చెక్ పోస్టు వైపు ఫ్లైఓవర్ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.

ముంబై వంటి నగరాల్లో ఏడాదిలోపే పనులు పూర్తవుతున్నాయని, అక్కడ ఉపయోగిస్తున్న సాంకేతికత, పనులు చేపట్టే విధానంపై అధ్యయనం చేయాలని సూచించారు. ప్రారంభించిన పనులు ఏడాదిలోపు పూర్తయ్యేలా చూడాలన్నారు.

హైదరాబాద్ – ముంబై బుల్లెట్ ట్రైన్ మార్గానికి సమాంతరంగా రేడియల్ రోడ్డు నిర్మాణంపై అధ్యయనం చేయాలని, శంకర్ పల్లి – చేవెళ్ల మధ్య ఉన్న రహదారుల విస్తరణతో పాటు నూతన రోడ్ల నిర్మాణానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని ఆదేశించారు.

రీసైకిల్డ్ వాటర్ వినియోగానికి సంబంధించిన పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. 500 ఎంఎల్‌డీ రీసైకిల్డ్ వాటర్ వినియోగానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. భారత్ ఫ్యూచర్ సిటీ, చందన్ వల్లి, ఆలూరులోని డేటా సెంటర్లు, ఇతర పరిశ్రమలు రీసైకిల్డ్ వాటర్ వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలని, హైరైజ్ భవనాలు, ల్యాండ్ స్కేప్స్, పార్కుల్లో రీసైకిల్డ్ వాటర్ వాడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

కోర్ చట్టం అమలుకు సంబంధించి హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్లు, హైడ్రా, వాటర్ బోర్డు, హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్ల కార్యాలయాల పనులు వేగవంతం చేయాలన్నారు.

ఈ సమావేశంలో సీఎం కార్యదర్శి మాణిక్ రాజ్, హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ సలహాదారు ఎన్‌వీఎస్ రెడ్డి, అదనపు మేనేజింగ్ డైరెక్టర్ అజిత్ రెడ్డి, హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్ల కమిషనర్లు ఆర్.వి.కర్ణన్, సృజన, వినయ్ కృష్ణారెడ్డి, వాటర్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.