రైతులకు సీఎం బిగ్ షాక్ – యాసంగి వద్దు, తాగునీరే ముద్దు!

251 టీఎంసీల నీటి కొరత.. యాసంగి సాగు వాయిదా వేసుకోండి!


ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో వచ్చే 10 నెలలు కష్టకాలమే – సీఎం రేవంత్

హైదరాబాద్, BB6 న్యూస్: రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర వాతావరణ మార్పులు, వర్షాభావ పరిస్థితులపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శనివారం సెక్రటేరియట్‌లో మంత్రులు, ఉన్నతాధికారులతో అత్యవసర ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

అనంతరం విలేకరుల సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. సంచలన ప్రకటన చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావం తీవ్రమైన ప్రకృతి విపత్తుగా మారిందని, ఇది 2020 నాటి కరోనా సంక్షోభం లాంటి గడ్డుకాలాన్ని తలపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.

శాస్త్రవేత్తల హెచ్చరికల ప్రకారం రాష్ట్రంలో దాదాపు 251 టీఎంసీల నీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉందని సీఎం తెలిపారు. ఈ నేపథ్యంలో రైతులకు కఠినమైన విజ్ఞప్తి చేశారు.

యాసంగి వాయిదా వేసుకోండి..
రాబోయే యాసంగి, ఎండాకాలం సీజన్లలో రైతులు ఎక్కువ నీరు అవసరమయ్యే వరి వంటి పంటల సాగును వాయిదా వేసుకోవాలని సీఎం కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయానికి సరిపడా నీటిని అందించడం ప్రభుత్వానికి సాధ్యం కాదని స్పష్టం చేశారు. రాజకీయ నాయకుల ఉచిత సలహాలను నమ్మి మోసపోవద్దని రైతులను హెచ్చరించారు.

రాబోయే 8 నుంచి 10 నెలలు రాష్ట్రానికి అత్యంత కష్టకాలమని, అందుబాటులో ఉన్న నీటిని మనుషులు, పశువుల తాగునీటి అవసరాలకే తొలి ప్రాధాన్యతగా దాచి ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు.

రైతులు నష్టపోకుండా తక్కువ నీటితో పండే కూరగాయలు, ఆరుతడి పంటలు, సన్న, చిన్న రకాల పంటలను ప్రత్యామ్నాయంగా సాగు చేసుకోవాలని సూచించారు. పంటలు మానుకునే రైతులకు ఉపాధి హామీ కింద అదనపు పనిదినాలు కల్పించి, ఆహార భద్రత చర్యల ద్వారా ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

“సేవ్ వాటర్.. సేవ్ పవర్” నినాదంతో నీటిని, విద్యుత్‌ను పొదుపుగా వాడుతూ ప్రభుత్వానికి సహకరించాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.

“సేవ్ వాటర్.. సేవ్ పవర్”