BB6 TELUGU NEWS CHANNEL
పంచాయతీ ఎన్నికల ఫలితాల తర్వాత గ్రామాల్లో వింత పరిస్థితులు నెలకొన్నాయి. గెలుపు కోసం నోట్లు, మద్యం పంచిన అభ్యర్థులు ఓటమి తర్వాత ఓటర్లపై ఒత్తిడి పెంచుతున్నారు. డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. కొందరు టెక్నాలజీని వాడుకుంటే, మరికొందరు ఆత్మహత్య బెదిరింపులకు పాల్పడుతున్నారు.
పంచాయతీ ఎన్నికల ఫలితాల అనంతరం గ్రామాల్లో వింత పరిస్థితులు నెలకొన్నాయి. గెలుపు కోసం నోట్లు, మద్యం పంపిణీ చేసిన అభ్యర్థులు, తీరా ఫలితాలు ప్రతికూలంగా రావడంతో ఓటర్లపై ఒత్తిడి పెంచుతున్నారు. ‘ఓటు వేయలేదు కాబట్టి.. మా డబ్బు మాకు ఇచ్చేయండి’ అంటూ డిమాండ్ చేస్తుండటంతో పల్లెల్లో కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. అభ్యర్థులు అనుసరిస్తున్న వినూత్న పద్ధతులు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలంలో ఒక ఓడిపోయిన అభ్యర్థి టెక్నాలజీని వాడుకుంటూ ఓటర్లను భయపెడుతున్నారు. తనకు ఓటు వేయకుండా డబ్బులు తీసుకున్న వారి పేర్ల జాబితా తన వద్ద ఉందని.. ఆ డబ్బులు వెనక్కి ఇవ్వకపోతే వారి పేర్లను ఐదేళ్లపాటు ప్రతిరోజూ వాట్సప్ స్టేటస్‌లో పెడతానని హెచ్చరించారు. ఇప్పటికే కొందరు పరువు పోతుందనే భయంతో డబ్బులు తిరిగి ఇచ్చేయగా.. వారికి కృతజ్ఞతలు చెబుతూ మరో పోస్ట్ పెట్టారు. ఈ పరిణామంతో తమ ‘స్టేటస్’ దెబ్బతింటుందని ఓటర్లు ఆందోళన చెందుతున్నారు.
మహబూబాబాద్ మండలం సోమ్లా తండాలో భూక్యా కౌసల్య అనే అభ్యర్థి కేవలం 27 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆమె ఆగ్రహంతో సేవాలాల్ జెండా పట్టుకుని ఇంటింటికీ తిరుగుతూ, తనకు ఓటు వేసినట్లు దేవుడి మీద ప్రమాణం చేయాలని లేనిపక్షంలో డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అటు ఖమ్మం జిల్లా హర్యా తండాలో స్వతంత్ర అభ్యర్థి మాలోత్ రంగ ఏకంగా సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేశారు. తాను దాదాపు 4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టానని డబ్బులు తీసుకుని తనను ఓడించిన వారు తిరిగి తన సొమ్ము ఇచ్చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడం సంచలనం సృష్టించింది.
నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం ఔరవాణి గ్రామంలో పరిస్థితులు మరింత దయనీయంగా మారాయి. అక్కడ ఓటమి చెందిన అభ్యర్థి కల్లూరి బాలరాజు తన భార్యతో కలిసి వినూత్నంగా ‘వసూళ్ల’ పర్వానికి తెరలేపారు. ఒక చేతిలో దేవుడి ఫోటో, మరో చేతిలో పురుగుల మందు డబ్బా పట్టుకుని ఇంటింటికీ తిరుగుతూ కన్నీరు పెట్టుకుంటున్నారు. తాము అప్పులు తెచ్చి మరీ డబ్బులు పంచామని ఓటు వేయని వారు మానవత్వంతో డబ్బులు వెనక్కి ఇచ్చేయాలని వేడుకుంటున్నారు. ఈ ఘటనలు ఎన్నికల ప్రక్రియలో డబ్బు ఏ స్థాయిలో ప్రవహిస్తుందో చెప్పడమే కాకుండా.. ఎన్నికల అనంతరం గ్రామీణ ప్రాంతాల్లో నెలకొంటున్న పరిస్థితులకు అద్దం పడుతున్నాయి.
డబ్బులు వెనక్కివ్వలేదో రోజూ ‘స్టేటస్’ పెడతా.. ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నెక్స్ట్ లెవల్ బ్లాక్‌మెయిల్
18
Dec