బాలికల వాష్‌రూమ్‌లో సీక్రెట్ కెమెరా. ఫొటోలు మార్ఫింగ్.. స్కూల్ అటెండర్ దారుణం

BB6 TELUGU NEWS CHANNEL
కరీంనగర్‌ జిల్లా కురిక్యాల ప్రభుత్వ పాఠశాలలో ఘోర ఘటన వెలుగుచూసింది. పాఠశాల అటెండర్‌ బాలికల ఫొటోలను తీసి వాటిని అశ్లీల చిత్రాలుగా మార్ఫింగ్‌ చేస్తున్నట్లు బయటపడింది. ఈ దారుణంపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హెడ్‌మాస్టర్‌ ఫిర్యాదుతో పోలీసులు చర్యలు తీసుకుని అటెండర్‌ను అదుపులోకి తీసుకున్నారు. బాలికల వాష్‌రూమ్‌లో కూడా కెమెరా అమర్చినట్లు విచారణలో బయటపడింది. సంఘటనతో విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామస్థులు షాక్‌కు గురయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో బాలికలు, మహిళలకు రక్షణ కరువవుతున్న సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా విద్యా సంస్థల్లోనే ఇలాంటి దారుణాలు జరగడం సమాజాన్ని కలిచి వేస్తోంది. తాజాగా కరీంనగర్ జిల్లాలోని కురిక్యాల ప్రభుత్వ పాఠశాలలో చోటు చేసుకున్న ఘటన తల్లిదండ్రుల్లో తీవ్ర ఆగ్రహాన్ని, భయాన్ని పెంచింది. అసలు ఏం జరిగిందో పూర్తి వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.

కురిక్యాల ప్రభుత్వ పాఠశాలలో బాలికల వాష్‌రూమ్‌లో సీక్రెట్ కెమెరా బయటపడటం ఈ వికృత చర్యకు సంబంధించిన వివరాలను వెలుగులోకి తెచ్చింది. వాష్‌రూమ్‌లో మెరుస్తున్న పరికరం బాలికల కంట పడటంతో.. అనుమానం వచ్చి వారు దానిని తనిఖీ చేయగా.. అది సీక్రెట్ కెమెరా అని గుర్తించారు. ఈ దారుణానికి ఒడిగట్టింది ఆ పాఠశాలకు చెందిన అటెండర్ యాకూబ్‌ అని తేలింది. ఇతను సీక్రెట్ కెమెరాను అమర్చి.. వీడియోలు రికార్డు చేస్తూ వికృత ఆనందం పొందుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అంతే కాకుండా.. అటెండర్ యాకూబ్ బాలికల ఫొటోలు తీసి వాటిని అశ్లీల చిత్రాలుగా మార్ఫింగ్ కూడా చేస్తున్నట్లు సమాచారం.

బాలికలు, వారి తల్లిదండ్రులు వెంటనే ఈ విషయాన్ని హెడ్‌మాస్టర్‌కు ఫిర్యాదు చేశారు. హెడ్‌మాస్టర్ ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసులు వాష్‌రూమ్‌ నుంచి కెమెరా తరహా పరికరాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ పరికరంలో ఉన్న రికార్డుల ఆధారంగా దర్యాప్తును వేగవంతం చేశారు. నిందితుడైన అటెండర్ యాకూబ్ ఈ విషయం బయటపడటంతోనే పరారీలో ఉన్నాడు.