చెర్వుగట్టు పుణ్యక్షేత్రం వద్ద భారీ అగ్నిప్రమాదం.. 17 దుకాణాలు, 15 తోపుడు బండ్లు దగ్ధం

BB6 TELUGU NEWS CHANNEL
నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం చెర్వుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి ఆలయం గుట్ట దిగువన అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 17 దుకాణాలు, 15 తోపుడు బండ్లు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. దీంతో వ్యాపారులు తీవ్ర ఆస్తినష్టాన్ని చవిచూశారు.

స్థానికుల వివరాల ప్రకారం, తొలుత ఒక బొమ్మల దుకాణంలో చిన్న స్థాయిలో మంటలు చెలరేగాయి. అయితే కొద్ది నిమిషాల్లోనే అవి పక్కనే ఉన్న ఇతర దుకాణాలకు వేగంగా వ్యాపించాయి. ఈ క్రమంలో దుకాణాల్లో ఉన్న గ్యాస్ సిలిండర్లు పేలిపోవడంతో మంటలు మరింత ఉద్ధృతంగా మారాయి.

సిలిండర్ల పేలుళ్లతో పెద్ద ఎత్తున శబ్దాలు రావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీసి ప్రాణాలు దక్కించుకున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

ఈ ప్రమాదంలో దుకాణాల్లో ఉన్న బొమ్మలు, పూజా సామగ్రి, ఫర్నిచర్, ఇతర వ్యాపార వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. వ్యాపారులకు లక్షల రూపాయల మేర నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా.

అయితే ప్రమాదం సంభవించిన సమయంలో దుకాణాల్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం జరగలేదు. అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. షార్ట్‌సర్క్యూట్ లేదా ఇతర కారణాలపై పోలీసులు, సంబంధిత అధికారులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe