గడ్డి మందు పారాక్వాట్ నిషేధించాలి అసెంబ్లీలో మంత్రి తుమ్మల తీర్మానం

BB6 TELUGU NEWS CHANNEL
తెలంగాణ: అసెంబ్లీలో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. వ్యవసాయంలో విస్తృతంగా వినియోగిస్తున్న పారాక్వాట్ డైక్లోరైడ్ 24% SL అనే ప్రమాదకర గడ్డిమందును తక్షణమే నిషేధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ మంత్రి తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈసందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. సమాజ, పర్యావరణ ప్రయోజనాలే పరమావధిగా ప్రభుత్వం ఈతీర్మానం చేసిందని స్పష్టం చేశారు.

పారాక్వాట్ వినియోగం వల్ల రైతులు, వ్యవసాయ కార్మికులు తీవ్రమైన ఆరోగ్యసమస్యలను ఎదుర్కొంటున్నారని, అనేక సందర్భాల్లో ఇది ప్రాణాంతకంగా మారుతున్నదని ఆయన పేర్కొన్నారు. క్షణికావేశంలో ఈ రసాయనం సేవించడం వల్ల జరుగుతున్న ప్రాణ నష్టాలు కూడా ఆందోళనకరంగా ఉన్నాయని తెలిపారు.

ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణ, జీవవైవిధ్య సంరక్షణ దృష్ట్యా ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వెల్లడించారు. పారాక్వాట్ వంటి అత్యంత విషపూరితర సాయనాల వినియోగం సుస్థిర, సహజ వ్యవసాయ విధానాలకు విరుద్ధమని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇప్పటికే యూరప్ సహా అనేక దేశాలలో పారాక్వాట్ పై నిషేధం లేదా కఠిన నియంత్రణలు అమలులో ఉన్నాయని మంత్రి గుర్తుచేశారు. రాష్ట్రంలో కూడా ఇలాంటి ప్రమాదకర రసాయనాల వినియోగాన్ని అరికట్టడం అత్యవసరమని పేర్కొన్నారు. పారాక్వాట్ కు ప్రత్యామ్నాయంగా అనేక గడ్డిమందులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకొని పారాక్వాట్ డైక్లోరైడ్ తయారీ, దిగుమతి,నిల్వ, రవాణా, విక్రయం, వినియోగంపై పూర్తిస్థాయి నిషేధం విధించాలని రాష్ట్ర అసెంబ్లీ ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఈ తీర్మానం ద్వారా రైతుల సంక్షేమం, ప్రజల ఆరోగ్య రక్షణ,పర్యావరణ పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe