బోనస్ పొందాలంటే ఈ రోజే చివరి గడువు.. ఏడు సన్న రకాలకే ప్రభుత్వ సాయం

బోనస్ కావాలంటే.. నమోదు తప్పనిసరి
ఈ నెల 17వ తేదీ వరకు అవకాశం

BB6 TELUGU NEWS CHANNEL
రాష్ట్ర ప్రభుత్వం వానాకాలం సీజన్ లో సన్న వరి సాగు చేస్తున్న రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. సన్న రకం ధాన్యం పండించే ప్రతి రైతుకు క్వింటాలుకు అదనంగా రూ. 500 చొప్పున బోనస్ అందజేయనున్నట్లు ప్రకటించింది. ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలనుకునే రైతులు నిర్దేశిత నిబంధనలను పాటించి సకాలంలో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. వానాకాలం – 2026లో జిల్లాలో సుమారు 1.70 లక్షల ఎకరాల్లో వరి సాగు అవుతుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇందులో సన్న, దొడ్డు రకాల వరిని రైతులు సాగు చేస్తున్నారు.

ప్రభుత్వం సన్న రకాలకు బోనస్ ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో అర్హులైన రైతులు తమ పేర్లను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ సూచించింది. ఈ నెల 17వ తేదీ వరకు నమోదు చేసుకునేందుకు అవకాశం ఉందని తెలిపింది.

ప్రభుత్వం బోనస్ కు నిర్దేశించిన సన్న రకాలలో తెలంగాణ సోనా (ఆర్ ఎన్ ఆర్ 15048), బీపీటీ 5204, జై శ్రీరామ్, హెచ్ ఎం టీ సోనా, కేఎన్ ఎం 1638, కేఎన్ ఎం 8715, డబ్ల్యూజీఎల్ – 44 ఉన్నాయి. ఈ ఏడు రకాల్లో ఏదైనా సాగు చేసిన రైతులు మాత్రమే తమ పంట వివరాలను నమోదు చేసుకోవాలని అధికారులు తెలిపారు.

విత్తన దుకాణంలోనే నమోదు
రైతులు సన్న రకం వరి విత్తనాలను కొనుగోలు చేసి నప్పుడు సంబంధిత విత్తన దుకాణంలోనే తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు. రైతుల వద్ద సొంతంగా ఉన్న సన్న రకం విత్తనాలను సాగు చేసినట్లయితే సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించి వివరాలను నమోదు చేయించుకోవాలి. విత్తన దుకాణంలో అప్పట్లో నమోదు చేసుకొని రైతులు విత్తనం కొనుగోలు చేసిన రశీదును చూపించి అదే దుకాణంలో తమ పేర్లు నమోదు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

డిజిటల్ క్రాప్ సర్వేలోనూ వివరాలు
ప్రస్తుతం జిల్లాలో డిజిటల్ క్రాప్ సర్వే కొనసాగుతున్న నేపథ్యంలో రైతులు తమ పొలం వద్దకు వచ్చే సర్వే సిబ్బందికి పంట వివరాలను సరైన రీతిలో నమోదు చేయించుకోవాలి. బోనస్ పొందేందుకు అవసరమైన వివరాల నమోదులో రైతులు సహకరించాలి.
– గోవింద్ నాయక్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి

నమోదైన వివరాలు డిజిటల్ గా భద్రపరచబడతాయని, భవిష్యత్తులో బోనస్ చెల్లింపులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా రైతులు సకాలంలో నమోదు చేసుకోవాలని కోరారు.