BB6 TELUGU NEWS CHANNEL
తెలంగాణలో ఆంధ్రా మీడియా పెత్తనం ఎక్కువైందంటూ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై కొన్ని మీడియా సంస్థలు ఉద్దేశపూర్వకంగా తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నాయని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నేతల జోలికి వస్తే సహించేది లేదని కాంగ్రెస్ సీనియర్ నేత రాజగోపాల్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. కొన్ని మీడియా సంస్థలు ఒళ్లు దగ్గర పెట్టుకుని వ్యవహరించాలని హెచ్చరించారు.
రాష్ట్రంలో ఆంధ్రా మీడియా పెత్తనం ఎక్కువైందని, తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ మీడియా ఎక్కడుంది? ఎవరికి సపోర్ట్ చేసిందో ప్రజలందరికీ తెలుసంటూ ప్రశ్నించారు.
ఈ సందర్భంగా ఆయన నేరుగా ఏబీఎన్, ఆంధ్రజ్యోతి పేర్లను ప్రస్తావించారు. తమలాంటి నిజాయితీ గల రాజకీయ నాయకులను కించపరిచే విధంగా కథనాలు రాస్తున్నారని ఆరోపించారు.
“సోదరా ABN రాధాకృష్ణా.. మా గురించి రాసే ముందు చూసుకొని రాయి, బాగుండదు.. ఒళ్లు దగ్గర పెట్టుకొని మర్యాదగా ఉంటే మంచిది” అంటూ ఘాటుగా హెచ్చరించారు. ఆంధ్రా మీడియా ఛానళ్లు తమకు సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
“మీడియా అంటే గౌరవం ఉంది. కానీ ఏబీఎన్ లాంటి 100 ఛానళ్లు, పేపర్లు పెట్టే శక్తి మాకు ఉంది. మేము అనుకుంటే ఇక్కడ ఏ ఛానల్ ఉండదు, ఏ పేపర్ ఉండదు” అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు. నేను తలుచుకుంటే వంద ఛానళ్లు పెడతానని అన్నారు.
తెలంగాణను కొట్లాడి సాధించుకున్నామని, ఇంకా ఆంధ్రా మీడియా మీద ఆధారపడి తెలంగాణ వ్యక్తులు ఎవరూ పనిచేయడం లేదని అన్నారు. తాను తెలంగాణ కోసం ఎంతో పోరాడానని, నిఖార్సైన తెలంగాణ నేతలను ఆంధ్రా మీడియా అడ్డుకోలేదని పేర్కొన్నారు. అంతేకాదు నిధుల విడుదల కోసమే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిశానని, రాజకీయ ఊహాగానాల్లో నిజం లేదని క్లారిటీ ఇచ్చారు.
మొత్తానికి తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తెలంగాణ vs ఆంధ్రా మీడియా చర్చకు రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు దారితీశాయి.
“తెలంగాణలో ఆంధ్రా మీడియా పెత్తనం ఎక్కువైంది” – కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
27
Aug