BB6 TELUGU NEWS CHANNEL
Telangana Heavy Rain Alert : తెలంగాణలో ఇవాళ్టి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Telangana Heavy Rain Alert : తెలంగాణకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి వాతావరణం పూర్తిగా మారిపోనుంది. రాగల నాలుగు రోజుల పాటు ఉష్ణోగ్రతలు క్రమంగా 2 నుండి 5 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
జూన్ 22 నుంచి దంచికొట్టనున్న వానలు
భారీ వర్ష సూచన – ఈ జిల్లాలకు హెచ్చరికలు :
జూన్ 22 ఉదయం నుంచి జూన్ 23 ఉదయంలోపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
జూన్ 23 ఉదయం నుంచి జూన్ 24 ఉదయం 8:30 గంటల వరకు వర్షాల తీవ్రత ఉంటుంది. ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, నల్గొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాజధాని హైదరాబాద్ సహా చుట్టుపక్కల జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
జూన్ 24 ఉదయం నుంచి జూన్ 25 ఉదయం వరకు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
జూన్ 25 ఉదయం నుంచి జూన్ 26 ఉదయం వరకు వర్షాల వ్యాప్తి మరింత పెరిగే సూచనలుంటాయి. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో దంచికొట్టే అవకాశం ఉంది.
ఇక జూన్ 26 నుంచి జూన్ 28 వరకు కూడా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. వర్షాలు కురిసే సమయంలో పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున గ్రామీణ ప్రాంతాల ప్రజలు, రైతులు చెట్ల కింద ఆశ్రయం పొందవద్దని అధికారులు హెచ్చరించారు.
తెలంగాణకు బిగ్ అలర్ట్ – ఇవాళ్టి నుంచి భారీ వర్షాలు..! ఐఎండీ హెచ్చరికలు
22
Jun