BB6 TELUGU NEWS CHANNEL
సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం పెద్దలోడి జెడ్పీ హైస్కూల్లో ఘోర ఘటన చోటుచేసుకుంది. ఫుడ్ పాయిజన్ కారణంగా 20 మంది విద్యార్థులు, స్కూల్ వైస్ ప్రిన్సిపల్ వెంకటేష్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
వివరాల్లోకి వెళ్తే.. వైస్ ప్రిన్సిపల్ వెంకటేష్ ఇంట్లో నిన్న ఫంక్షన్ జరిగింది. ఫంక్షన్లో మిగిలిన ఆహారాన్ని సిబ్బంది ఈరోజు మధ్యాహ్నం విద్యార్థులకు వడ్డించినట్లు సమాచారం. ఆ ఆహారం తిన్న కొద్దిసేపటికే విద్యార్థుల్లో వాంతులు, తల తిరగడం వంటి లక్షణాలు కనిపించాయి. క్రమంగా 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
సమాచారం అందుకున్న వెంటనే ఉపాధ్యాయులు విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు. 15 మంది విద్యార్థులు సదాశివపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో 5 మంది విద్యార్థులు సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
అయితే అందరిలోనూ వైస్ ప్రిన్సిపల్ వెంకటేష్ పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన్ను హుటాహుటిన సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
ఘటనపై ప్రశ్నలు:
ఫంక్షన్ మిగిలిన ఆహారాన్ని విద్యార్థులకు పెట్టాలని ఎవరు ఆదేశించారు?
నిల్వ ఆహారం సురక్షితమో కాదో పరిశీలించకుండా ఎలా వడ్డించారు?
స్కూల్ సిబ్బంది నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణమా?
ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సంబంధిత అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టనున్నట్లు సమాచారం.
రిపోర్టర్: బిబి6 తెలుగు న్యూస్
జెడ్పీ హైస్కూల్లో ఫుడ్ పాయిజన్: 20 మంది విద్యార్థులకు అస్వస్థత.. వైస్ ప్రిన్సిపల్ వెంకటేష్ పరిస్థితి విషమం
17
Sep