డాక్టర్ నిర్లక్ష్యంతో బాలింత మృతి. హాస్పటల్ కు కోటి జరిమానా.?

BB6 TELUGU NEWS CHANNEL
నల్గొండ జిల్లా నార్కట్‌పల్లిలోని కామినేని హాస్పిటల్‌ వైద్యుల నిర్లక్ష్యంపై జిల్లా వినియోగదారుల ఫోరం సంచలన తీర్పును వెలువరించింది. వైద్యుల తప్పిదం కారణంగా ఓ బాలింత మరణించిన కేసులో మృతురాలి కుటుంబానికి రూ. కోటి పరిహారం చెల్లించాలని ఫోరం ఆదేశించింది. వివరాల్లోకి వెళితే.. నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఆరెగూడెం గ్రామానికి చెందిన అస్నాల స్వాతి డెలివరీ కోసం 2018 జూలై 13న కామినేని హాస్పిటల్‌లో చేరింది. డాక్టర్లు ఆమెకు అనస్థీషియా ఇచ్చి ఆపరేషన్ చేసి శిశువును బయటకు తీశారు. అయితే, మరుసటి రోజు ఉదయం 9:15 గంటల వరకు కూడా స్వాతికి స్పృహ రాకపోవడంతో కుటుంబ సభ్యులకు అనుమానం కలిగింది. డాక్టర్లను ప్రశ్నించగా, మత్తుమందు డోస్ సరిపోకపోవడంతో రెండో డోస్ ఇచ్చామని అందుకే స్పృహ రావడానికి ఆలస్యం అవుతుందని సమాధానం ఇచ్చారు. కుటుంబ సభ్యులు గ్రామ పెద్దలకు సమాచారం ఇవ్వడంతో వారు ఆసుపత్రికి వచ్చి నిలదీశారు. ఈ సమయంలోనే స్వాతిని ఐసీయూలోకి తరలించారు. 14వ తేదీ ఉదయం స్వాతి ఉన్న బెడ్ అంతా రక్తంతో నిండిపోవడాన్ని చూసి ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ప్రశ్నించగా.. ఆమె కోమాలోకి వెళ్లిందని వంద మందిలో ఒకరికి ఇలా జరుగుతుందని డాక్టర్లు చెప్పారు. ఆ తర్వాత ఉదయం 9:15 గంటలకు స్వాతి భర్త క్రాంతికుమార్‌తో ‘హైరిస్క్’ పేపర్‌పై సంతకం చేయించుకుని సుమారు గంటన్నర తర్వాత ఆమె చనిపోయినట్లు ప్రకటించారు.

దీంతో కామినేని డాక్టర్లు మాధవి, సునీతా మిశ్రా, ప్రసాద్, మారుతి సహా ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే స్వాతి మరణించిందని ఆరోపిస్తూ ఆమె భర్త క్రాంతికుమార్, తండ్రి సత్యనారాయణ.. అడ్వకేట్ మేరెడ్డి నర్సింహారెడ్డి ద్వారా నల్గొండ జిల్లా వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు. కేసును పూర్తిస్థాయిలో విచారించిన ఫోరం కామినేని డాక్టర్ల నిర్లక్ష్యం స్పష్టంగా ఉందని నిర్ధారించింది. ఈ మేరకు బాధిత కుటుంబానికి రూ. కోటి పరిహారం చెల్లించాలని తీర్పు ఇచ్చింది. పరిహారంలో రూ. 90 లక్షలను స్వాతి కుమారుడు దేవాన్ష్ శౌర్య పేరున జాతీయ బ్యాంకులో డిపాజిట్ చేయాలని మిగతా రూ. 10 లక్షలను స్వాతి తండ్రి సత్యనారాయణకు చెల్లించాలని ఆదేశించింది. అదనంగా రూ. లక్ష ఫైన్‌ను కూడా బాధిత కుటుంబానికే చెల్లించాలని తీర్పునిచ్చింది. ఈ పరిహారం మొత్తాన్ని నెల రోజుల్లోగా చెల్లించాలని, లేదంటే 9 శాతం వడ్డీని కలిపి చెల్లించాల్సి ఉంటుందని ఫోరం ఉత్తర్వుల్లో పేర్కొంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe