తెలంగాణ : విద్యార్థుల కడుపు నింపే మధ్యాహ్న భోజన పథకంపై ప్రవచన కర్త గరికపాటి నరసింహారావు వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో పెనుదుమారం రేపింది. విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం పెట్టి.. పుస్తకాలు,బట్టలు అన్నీ ఉచితంగా ఇస్తే చదువుపై ఇంకేం శ్రద్ధ పెడతారని.. టీచర్లకు చదువు చెప్పడం కంటే వంట వండించటం, గుడ్లులెక్క రాయడమే సరిపోతుందని గరికపాటి చెప్పినట్టుగా ఆ వీడియోలో ఉంది. శోభనం గదిలో పెళ్లికొడుకులా పిల్లలు భోజనం కోసం కూర్చుoటున్నారని గరికపాటి ఎద్దేవా చేసినట్లుగా వీడియోలో ఉంది.
BB6 TELUGU NEWS CHANNEL
మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని,పేద విద్యార్థులంటే ఆయనకు చులకనభావం ఉందని.. ఆయన అహంకారపూరిత మనస్తత్వానికి నిదర్శనం అని పలువురు రాజకీయ ప్రముఖులు కూడా గరికపాటిపై మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈ వీడియో రెండు తెలుగురాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశం కావడంతో గరికపాటిపై తీవ్ర విమర్శలొచ్చాయి. ఈవీడియోపై 2.3 మిలియన్ల ఫాలోవర్లు ఉన్న గరికపాటి నరసింహారావు ఫేస్ బుక్స్ లో ఆయన టీం ఒక ప్రకటన విడుదల చేసింది.
రాజమండ్రిలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలలో గరికపాటి మధ్యాహ్నభోజన పథకంపై విమర్శ చేసినట్లుగా వస్తున్న వీడియో వక్రీకరించిందని ఆయన టీం చెప్పుకొచ్చింది. ఆ సభలలో గురువుగారు అలా మాట్లాడలేదని.. వేరే సందర్భంలో.. వేరే ఉద్దేశ్యంతో గురువుగారు మాట్లాడిన మాటలను కలగలిపి ఈవీడియోకి జత చేసి వ్యతిరేక అర్థం వచ్చేలా దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన టీం వివరణ ఇచ్చింది.
గురువు గారు ఎప్పుడు పేదల పక్షమేనని.. భగవంతుడు ఎప్పుడూ పేదవాళ్ళ పార్టీనే అని గర్వంగా వేదికలపై గరికపాటి ఎన్నోసార్లు ప్రకటించారని ఆయన టీం గుర్తుచేసింది. గరికపాటి ప్రసంగాల ప్రభావంతో పేదలందరూ హిందూ ధర్మ స్పూర్తితో ఉండటం చూసి జీర్ణించుకోలేక వారిని పేదల నుంచి దూరం చేయడానికి కొంత మంది మూర్ఖులు వారిపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన టీం చెప్పుకొచ్చింది. ఇటువంటి కుతంత్రాలకు
ఎవ్వరూ లొంగవద్దని గరికపాటి టీం విజ్ఞప్తి
చేసింది.
