ముదిరాజ్‌ల ఆరాధ్య దైవం పండుగ సాయన్నకు తెలంగాణ ప్రభుత్వం ఘన గౌరవం
BB6 TELUGU NEWS CHANNEL
ముదిరాజ్‌ల ఆరాధ్య దైవం, ప్రజా వీరుడు పండుగ సాయన్న జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ఇకపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుంది.
సభలో మంత్రి వాకిటి శ్రీహరి చేసిన విజ్ఞప్తికి స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల నిర్వహించిన పాపన్న గౌడ్ సభలో పండగ సాయన్న జయంతి వర్ధంతి కార్యక్రమాలు అధికారికంగా నిర్వహించాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ని ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం జీఓ ఆర్టీ నెం.1217, తేదీ 20-08-2026ను విడుదల చేసింది.
జీఓ ప్రకారం ప్రతి సంవత్సరం అక్టోబర్ 22న పండుగ సాయన్న జయంతిని, డిసెంబర్ 10న పండుగ సాయన్న వర్ధంతిని రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ‘స్టేట్ ఫంక్షన్’గా నిర్వహించనున్నారు.
రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు పండుగ సాయన్న జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ కార్యక్రమాల నిర్వహణకు బీసీ సంక్షేమ శాఖను నోడల్ శాఖగా ప్రభుత్వం నియమించింది.
పండుగ సాయన్న చరిత్ర, పోరాట స్ఫూర్తి, ధైర్యసాహసాలను భావితరాలకు తెలియజేసేలా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ముదిరాజ్ సమాజం చిరకాలంగా కోరుతున్న ఈ డిమాండ్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం పట్ల ముదిరాజ్ సమాజం హర్షం వ్యక్తం చేస్తోంది.
ముదిరాజ్‌ల ఆరాధ్య దైవం పండుగ సాయన్నకు రాష్ట్ర ప్రభుత్వం అధికారిక గౌరవం కల్పించడం ముదిరాజ్ సమాజ ఆత్మగౌరవానికి దక్కిన గుర్తింపు.