TG Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇండ్ల పథకంలో కీలక మార్పులు – కలెక్టర్లకు మరిన్ని అధికారాలు..!

BB6 TELUGU NEWS CHANNEL
Indiramma Illu scheme in Telangana : ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని వేగవంతం చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. కలెక్టర్లకు అదనపు అధికారాలు కట్టబెట్టింది. గతంలో దరఖాస్తు చేసుకోనివారు ఇప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి పొంగులేటి ప్రకటించారు.

సొంతింటి కల కలిగిన నిరుపేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఇందిరమ్మ ఇండ్లు’ పథకం ఇకపై మరింత వేగవంతం కానుంది. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులను తొలగిస్తూ, లబ్ధిదారులకు త్వరితగతిన న్యాయం చేసే దిశగా ప్రభుత్వం అధికార వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టింది. హైదరాబాద్‌లోని హౌసింగ్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల ఇన్‌ఛార్జ్ మంత్రులు, ప్రజాప్రతినిధులు మరియు ఉన్నతాధికారులతో జరిగిన ఈ భేటీలో హౌసింగ్, రెవెన్యూ అంశాలపై సమగ్రంగా చర్చించారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరు అనేది కేవలం ఒక కార్యక్రమం మాత్రమే కాదని… ఇది నిరంతర ప్రక్రియ అని గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్ప,ష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లను మంజూరు చేశామని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇల్లు అందాలన్నదే తెలిపారు.

కలెక్టర్లకు పూర్తి బాధ్యతలు…
ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలులో జాప్యాన్ని నివారించేందుకు జిల్లా కలెక్టర్లకు అదనపు బాధ్యతలు, అధికారాలను అప్పగించారు. జిల్లా హౌసింగ్ అధికారులతో ప్రతి వారం సమీక్ష నిర్వహించి… ఇళ్ల నిర్మాణ పురోగతిని పర్యవేక్షించాలని కలెక్టర్లను ఆదేశించారు. ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ పథకాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఉమ్మడి జిల్లాకు ఒక ప్రత్యేక అధికారిని నియమించనున్నారు. గతంలో దరఖాస్తు చేసుకోలేకపోయిన వారు ఇప్పుడు దరఖాస్తు చేసుకున్నా, అర్హత ఉంటే వారికి వెంటనే ఇల్లు మంజూరు చేయాలని నిర్ణయించారు. ఒకవేళ ఎవరైనా లబ్ధిదారులు ఇల్లు నిర్మించుకోలేమని వెనక్కి తగ్గితే…. వారి స్థానంలో వేచి చూస్తున్న ఇతర అర్హులకు అవకాశం కల్పిస్తారు.

అసంపూర్తి ఇళ్లపై ప్రత్యేక దృష్టి….
గత ప్రభుత్వం నిర్మించి, మౌలిక వసతులు లేక అసంపూర్తిగా వదిలేసిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ వంటి వసతులను యుద్ధ ప్రాతిపదికన కల్పించాలని నిర్ణయించారు. అవి ఏ స్థితిలో ఉన్నా సరే లబ్ధిదారులకు కేటాయించాలని మంత్రి పొంగులేటి అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో స్థలాల కొరత దృష్ట్యా 400 నుంచి 600 చదరపు అడుగుల విస్తీర్ణంలో ‘జీ ప్లస్ వన్’ పద్ధతిలో ఇళ్లు నిర్మించుకునే వెసులుబాటు కల్పించారు. బేస్‌మెంట్ పూర్తయిన తర్వాత సాంకేతిక కారణాలతో నిలిచిపోయిన బిల్లులను తక్షణమే విడుదల చేయాలన్నారు.

రెవెన్యూ వివాదాలకు చెక్:
భూ భారతితో తీసుకువచ్చిన భూ సర్వే విధానంతో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని మంత్రి పొంగులేటి చెప్పారు. రాష్ట్రంలోని ఐదు మండలాలలో ప్రయోగాత్మకంగా సర్వే మ్యాపుతో రిజిస్ట్రేషన్ చేస్తున్నామని తెలిపారు. రిజిస్ట్రేషన్ పూర్తి అయిన తరువాత సర్వే మ్యాపు నెంబరు, భూదార్ నెంబరు కేటాయిస్తున్నామని పేర్కొన్నారు.

సాదా బైనామాలకు సంబంధించి వీలైనంత త్వరగా దరఖాస్తులను పరిష్కరిస్తాం.ఈ దరఖాస్తుల పరిష్కారం మరింత వేగవంతం చేయడానికి వీలుగా ఆర్డీవోలకే అధికారాలను అప్పగిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా దశలవారీగా, తహశీల్దార్ కార్యాలయాలను నిర్మిస్తాం. తొలిదశలో శిధిలావస్థకు చేరిన చోట నిర్మిస్తాం. ప్రతిజిల్లా కేంద్రంలో అత్యాధునిక వసతులతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను నిర్మిస్తున్నాం. దశాబ్దాల నుంచి రెవెన్యూ, ఫారెస్టు, ఎండోమెంట్, వక్ఫ్ మధ్య సరిహద్దు వివాదాలు ఉన్నాయి. ఉమ్మడి సర్వే నిర్వహించి ఇటువంటి సమస్యలు శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించడం జరిగింది” అని మంత్రి పొంగులేటి వివరించారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe