BB6 TELUGU NEWS CHANNEL
Nizamabad : జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాలు–2026 కార్యక్రమానికి టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నిజామాబాద్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రజల ప్రాణభద్రతే లక్ష్యంగా రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాల వల్ల దేశవ్యాప్తంగా వేలాది కుటుంబాలు విషాదంలో కూరుకుపోతున్నాయని, వీటిని నివారించడంలో ప్రభుత్వంతో పాటు ప్రజల బాధ్యత కూడా కీలకమని అన్నారు. హెల్మెట్ వినియోగం, సీట్‌బెల్ట్ తప్పనిసరి, మద్యం సేవించి వాహనం నడపకుండా ఉండటం, ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు. యువత ముఖ్యంగా రోడ్డు భద్రత విషయంలో ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు.తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల భద్రత, సంక్షేమానికి అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. రోడ్డు మౌలిక వసతుల మెరుగుదల, ట్రాఫిక్ నియంత్రణ వ్యవస్థల ఆధునీకరణ, అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రమాదాల నియంత్రణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. రోడ్డు భద్రత వారోత్సవాలు కేవలం కార్యక్రమాలకే పరిమితం కాకుండా, ప్రజల జీవన విధానంలో మార్పు తీసుకురావాలని ఆయన ఆకాంక్ష వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ, నగేష్ రెడ్డి, కేశ వేణు, రాం భూపాల్, గడుగు గంగాధర్, విపుల్ గౌడ్ పాల్గొని రోడ్డు భద్రతపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. అలాగే ఆర్టీఏ అధికారి రాజానరేందర్ గౌడ్ రోడ్డు భద్రత నిబంధనలపై సాంకేతిక వివరాలు వివరించారు.
ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ నాయకులు, పార్టీ ప్రతినిధులు, అధికారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని రోడ్డు భద్రతపై అవగాహనను పెంపొందించారు.
ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాలు–2026
21
Jan