ఉపాధి పేరుపై పేచీ..రూ.300 కోట్లు పెండింగ్

విబీజీ రామ్ జీ నిబంధనల మార్పు ఎఫెక్ట్

ఈ ఆర్థిక సంవత్సరం ఇంకా ఖరారుకాని బడ్జెట్

నిధులు, పని దినాలపై కొరవడిన స్పష్టత

ఏటా తగ్గుతున్న లేబర్ బడ్జెట్

3 నెలలుగా ఆగిపోయిన ఉపాధి బకాయిలు

మళ్లీ వేల కుటుంబాల వలసబాట

BB6 TELUGU NEWS CHANNEL
Telangana : కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ స్కీమ్క గతంలో మాదిరిగా నేరుగా బడ్జెట్ కేటాయించకుండా కొత్త పథకంలో విలీనం చేయనుంది. ఇందులో భాగంగా MGNREGS స్థానంలో ‘వికసిత్భారత్- గ్యారంటీ ఫర్ రోజ్ గార్ అండ్ ఆజీవిక మిషన్’ కొత్త స్కీమ్న తీసుకొచ్చింది. దాంతో పాత ఉపాధి హామీ పథకానికి బడ్జెట్ కేటాయింపులను తగ్గించి కొత్త పథకానికి మళ్లించింది. గతంలో కేంద్రం 90 శాతం, రాష్ట్రప్రభుత్వాలు 10 శాతం నిధులు భరించేవి. కొత్త స్కీమ్ లో కేంద్రం 60 శాతం,రాష్ట్రాలు 40 శాతం భరించేలాగా మార్పులు చేసింది. ఉపాధి హామీ చట్టం ప్రకారం పాత పద్ధతిలో పని అడిగితే హక్కుగా కల్పించాలనే నియమం ఉండేది. కానీ, ఇప్పుడు కేంద్రం పరిమితి
విధించింది.

ఆ పరిమితి దాటి పని కావాలంటే రాష్ట్రాలే సొంతంగా ఖర్చు పెట్టుకోవాల్సిందే.. కాగా,రాష్ట్రానికి గత మూడు నెలలుగా రావాల్సినరూ.300 కోట్లను కేంద్రం పెండింగ్ లో పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం వీబీ జీ రామ్ స్కీమ్ ను వ్యతిరేకిస్తుండడం.. ఇంకా పాత ఉపాధి పథకాన్నే కొనసాగిస్తుండడంతో పేరుపై పేచీ కారణంగా కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు పెండింగ్లో పెట్టినట్లు తెలిసింది. ఫలితంగా దాని
ప్రభావం ఉపాధి కూలీలు, ఫీల్డ్ అసిస్టెంట్లు,ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపై పడింది.ప్రతినెలా సుమారు రూ.100 కోట్ల చొప్పున మూడు నెలలకు రూ.307 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. ఇందులో రూ.57 కోట్లు మాత్రమే కేంద్రం చెల్లించింది.

వేతనాలు అందక ఆందోళనలో సిబ్బంది..

రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం కింద 12,500 మందికిపైగా పనిచేస్తున్నారు. వీరిలో ఫీల్డ్ అసిస్టెంట్లు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో పాటు ఇతర సిబ్బందికి మూడు నెలలుగా వేతనాలు అందలేదు. రాష్ట్రవ్యాప్తంగా సిబ్బంది జీతాలు లేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. ఇంటి అద్దె, నిత్యావసరాలు, స్కూల్ ఫీజులకోసం అప్పులు చేయాల్సి వస్తున్నదని వాపోతున్నారు. కూలీలు సైతం వేతనాలు అందక తీవ్ర అవస్థలు పడుతున్నారు. చట్టప్రకారం 15 రోజుల్లో కూలి డబ్బులు జమచేయకపోతే.. రోజువారీగా లెక్కేసి పరిహారాన్ని అందించాల్సి ఉంటుంది.

రాష్ట్రంలో 52.21 లక్షల జాబ్ కార్డులు..

రాష్ట్రంలో 52.21 లక్షల జాబ్ కార్డులు ఉండగా.. మొత్తం 1.07 కోట్ల మంది కూలీలు ఉన్నారు. వీరిలో యాక్టివ్ గా పనిచేసే కూలీలు 49.64 లక్షల మంది ఉన్నారు. వీరికి కనీసం వంద రోజులకు తగ్గకుండా ఉపాధి పనులు కల్పించాలి. ఉపాధి పనులకు సంబంధించి కేంద్రప్రభుత్వం జాతీయ మొబైల్ పర్యవేక్షణ విధానం (ఎస్ఎంఎంఎస్) అమలులోకి తెచ్చింది. ఆ యాప్లో కూలీల ముఖ ఆధారిత హాజరు తీసుకున్నాకే పనికల్పించాలి. ఉదయం 8 గంటలకు కూలి ఒకసారి ఫొటో దిగితే మళ్లీ మధ్యాహ్నం 12గంటలకు ఫొటో తీయడానికి ఆస్కారం ఏర్పడుతుంది.ఒక గ్రామంలో వంద మంది కూలీలు నాలుగైదు ప్రాంతాల్లో పనిచేస్తే అన్ని ప్రాంతాలకు వెళ్లి ఫీల్డ్ అసిస్టెంట్ రెండుసార్లు అథెంటిఫికేషన్ ఫొటో తీయాల్సిందే. లేకపోతే పనిచేసినా ఆయా కూలీలకు డబ్బులు జమకావు.  అయితే, మారుమూల గ్రామాల్లో సిగ్నల్ సమస్యలు, యాప్లో సాంకేతిక లోపాలతో చాలా మందికి హాజరుపడడం లేదు. పనిచేసినా హాజరు నమోదు కాకపోవడంతో వేతనాలు రాక కూలీలు పనులకు వెళ్లడమే మానేస్తున్నారు. ఫలితంగా రాష్ట్రంలో సుమారు 5 లక్షల మంది కూలీలు ఈపథకానికి దూరమైనట్లు గణాంకాలు
చెబుతున్నాయి.

ప్రతి ఏడాదికి తగ్గుతున్న లేబర్ బడ్జెట్

ఉపాధి హామీ పథకానికి కేంద్రం ఏటా లేబర్ బడ్జెట్ ను తగ్గిస్తూ వస్తోంది. పనిదినాలను గణనీయంగా తగ్గించడమేకాకుండా నిధుల విడుదలలో జాప్యం కూడా చేస్తున్నది. నాలుగేండ్లలోనే గ్రామీణ కూలీల పనిదినాలను సగానికి తగ్గించింది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి 11 కోట్ల పనిదినాలను మంజూరు చేయగా.. 2025–26లో వాటిని 7కోట్లకే పరిమితం చేసింది. సుమారు 4 కోట్ల పనిదినాలను కుదించింది. దీంతో గ్రామాల్లో వేల కుటుంబాలు ఉపాధి కోల్పోయి వలసబాటపట్టాయి. ప్రస్తుత 2026–-27 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పథకానికి కేంద్రం ఇంత వరకు బడ్జెట్ ను ఖరారు చేయలేదు.

Related News

ఈ ఏడాది ఎన్ని పని దినాలు కల్పిస్తారు? ఎన్ని నిధులు కేటాయిస్తారు? అనేదానిపై స్పష్టత కొరవడింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe