కాంగ్రెస్ , బీఆర్ఎస్, బీజేపీలో బూత్ లేవెల్ ఏజెంట్ల నియామకం రాష్ట్రంలో మే చివరి వారం, లేదంటే జూన్లో ‘సర్’ ప్రక్రియ ఆయా రాష్ట్రాల్లో లక్షల ఓట్లు తొలగింపు ఓట్లు గల్లంతు కాకుండా పార్టీల జాగ్రత్తలు
BB6 TELUGU NEWS CHANNEL
తెలంగాణ రాష్ట్రంలో ఓటర్లజాబితా సవరణ నేపథ్యంలో ప్రధానరాజకీయ పార్టీలు అలర్ట్ అయ్యాయి. కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్)’ ప్రక్రియమే చివరి వారం లేదా జూన్ మొదటివారం నుంచి ప్రారంభం కానుంది. ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతుండటం, దేశవ్యాప్త జనగణన ఈ నెలలోనే మొదలవుతుండటంతో ఈసీ ఈ నిర్ణయాన్ని కొంత వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఈ లోపే అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని భావిస్తున్న ప్రధాన పార్టీలు ఇప్పటికే తమ కార్యాచరణను సిద్ధం చేసుకున్నాయి. గతంలో ఇతర రాష్ట్రాల్లో జరిగిన ‘సర్’ ప్రక్రియలో లక్షలాదిఓట్లు తొలగింపునకు గురైన ఉదంతాలు ఇప్పుడు తెలంగాణలోని పార్టీలను కలవరపెడుతున్నాయి. తమ వారి ఓట్లు గల్లంతు కాకుండా కాంగ్రెస్, బీఆర్ఎస్,బీజేపీ బూత్ స్థాయి నుంచే వ్యూహాలకు పదును పెడుతున్నాయి.
స్పెషల్ టీమ్స్ రెడీ
రాష్ట్రవ్యాప్తంగా చేపట్టే ఈ ప్రక్రియపై చీఫ్ఎలక్టోరల్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి ఇప్పటికే అన్ని పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించారు. ప్రతి పోలింగ్ సెంటర్లకు కనీసం ఒక్కరైనా బూత్ లెవల్ ఏజెంట్ (బీఎల్ఏ)ను నియమించాలని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జిలతో సమావేశమై బీఎల్ఎలను గుర్తించి వివరాలను పంపాల్సిందిగా కోరింది. త్వరలోనే ఈ వివరాలను సీఈఓ కార్యాలయానికి అందజేయ నుంది. మరోవైపు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలోని అన్ని పోలింగ్ బూత్ల స్థాయిలో ఏజెంట్ల గుర్తింపు ప్రక్రియను పూర్తి చేసింది. ప్రతి వార్డులో ఓట్ల తొలగింపుపై నిఘా పెట్టాలని పార్టీ శ్రేణులకు ఆదేశాలిచ్చింది. బీజేపీ కూడా డిజిటల్ మ్యాపింగ్లో తనకున్నపట్టును వాడుకుంటూ ‘పన్నా ప్రముఖ్ ‘ల ద్వారా సర్ కోసం బూత్ లెవెల్ క్యాడర్ ను రెడీ చేసుకుంటోంది.
58 శాతమే మ్యాపింగ్ పూర్తి రాష్ట్రంలో చేపట్టిన మ్యాపింగ్ లో పలు చోట్ల 2002 జాబితాలో ఉన్న ఓటర్లలో సగటున 50 శాతం మంది కూడా ప్రస్తుతం స్థానికంగా ఉండటం లేదని బీఎల్వోలసర్వేలో తేలింది. 2025 ఓటర్ల జాబితాను 2002 నాటి ఎఆర్ డేటాతో అనుసంధానిస్తూ చేస్తున్న టేబుల్ టాప్మ్యాపింగ్ లో ఈ వివరాలు వెల్లడయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3.35 కోట్ల ఓటర్లకు సంబంధించి ఇప్పటికే 58 శాతం మ్యాపింగ్ పూర్తయింది. వలసలు ఎక్కువగా ఉన్న హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, రంగారెడ్డి జిల్లాల్లో మ్యాపింగ్30 శాతంలోపే ఉండగా, గ్రామీణ జిల్లాల్లో మాత్రం 85 శాతం మేర పూర్తయింది. ఆ రాష్ట్రాల్లో లక్షల్లో ఓటర్లు ఔట్..బిహార్, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో జరిగిన ‘సర్’ ప్రక్రియ రాజకీయంగా పెద్ద దుమారమే రేపింది. ఆ రాష్ట్రాల్లో భారీ స్థాయిలో ఓటర్ల పేర్లు గల్లంత య్యాయి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో సుమారు 91 లక్షలు, బిహార్లో 74 లక్షలకు పైగా ఓట్లను ఎన్నికల సంఘం తొలగించింది. ఇందులో మరణించిన వారు, శాశ్వతంగా వలస వెళ్లిన వారితో పాటు డూప్లికేట్ ఓట్లు కూడా ఉన్నాయి. కేరళలో కూడా మొత్తం ఓటర్లలో దాదాపు 3.22 శాతం ఓట్లు డిలీట్ అయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణలో
అలాంటి పరిస్థితి తలెత్తకుండా క్షేత్రస్థాయి అధికారులతో కలిసి పని చేయాలని అన్ని పార్టీలు తమ కేడర్ను ఆదేశించాయి.