Hyderabad land auction Rayadurgam 2026: హైదరాబాద్ రాయదుర్గం రియల్ సంచలనం – ఎకరం రూ.237 కోట్లు.. దేశంలోనే కొత్త రికార్డు!

BB6 TELUGU NEWS CHANNEL
హైదరాబాద్‌లో భూముల ధరలు చుక్కలను అంటుతున్నాయి. తాజాగా నిర్వహించిన వేలంలో ఎకరా ఏకంగా రూ.237 కోట్లు పలికి.. అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ భూములకు కనీస ధరనే రూ.139 కోట్లు అధికారులు నిర్ణయించారు. అయితే ఇంకా వేలం కొనసాగుతుండటంతో ఈ రికార్డులు కూడా బద్దలయ్యే అవకాశాలు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. గతేడాది అక్కడే రూ.177 కోట్లు పలకడం గమనార్హం. ఐటీ హబ్, లగ్జరీ మాల్స్, గేటెడ్ కమ్యూనిటీలు ఉండటంతో రాయదుర్గం కాస్ట్‌లీగా మారింది.

విశ్వ నగరంగా మారుతున్న హైదరాబాద్‌‌లో తెలంగాణ భూముల ధరలకు రెక్కలు వస్తున్నాయి. ఏటికేడాది భూముల ధరలు ఎన్నో రెట్లు పెరిగిపోతున్నాయి. తెలంగాణ గ్రోత్ అండ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీజీఐఐసీ) హైదరాబాద్ నగరంలోని ప్రభుత్వ భూములను విడతల వారీగా వేలానికి అందుబాటులో ఉంచుతోంది. రోజులు మారుతున్న కొద్దీ.. ఈ భూములకు వేలంలో అత్యధిక ధరలు పలికి.. నగరవాసులను ఆశ్చర్యానికి గురి చేస్తూనే ఉన్నాయి. ఇక హైదరాబాద్ న్యూసిటీలో ఉన్న రాయదుర్గంలో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.
తాజాగా రాయదుర్గంలో టీజీఐఐసీ నిర్వహించిన భూముల వేలానికి భారీ స్పందన లభించింది. పాన్‌మక్తాలో భూమి రికార్డు ధర పలికి.. అందర్నీ షాక్‌కు గురి చేసింది. ఎకరం ధర ఏకంగా రూ.237 కోట్లు పలికి.. అందర్నీ సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. ఈ విషయాన్ని టీజీఐఐసీ అధికారులు వెల్లడించారు. పాన్‌మక్తాలోని సర్వే నంబర్‌ 83/1లో 6 ఎకరాల 29 గుంటలకు వేలం నిర్వహించగా.. ఈ రికార్డు స్థాయి ధర పలికింది. ఇంకా వేలం కొనసాగుతోందని.. మరింత ఎక్కువ ధరలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు.. గతేడాది అక్టోబర్‌లో అదే ప్రాంతంలో టీజీఐఐసీ వేలం నిర్వహించగా.. ఎకరం రూ.177 కోట్ల ధర పలికినట్లు అధికారులు పేర్కొన్నారు.

అయితే ఇక్కడ ఉన్న భూములను మొత్తం 2 విడతలుగా మొత్తం 11.38 ఎకరాలను టీజీఐఐసీ వేలానికి ఉంచింది. టీ హబ్‌ సమీపంలో ఉన్న 6.29 ఎకరాలతోపాటు.. ఐటీసీ కోహినూర్‌ సమీపంలో ఉన్న మరో 5.09 ఎకరాల స్థలాలకు వేలం వేయాలని నిర్ణయించింది. అయితే ఈ భూములకు ఎకరాకు రూ.139 కోట్ల కనీస ధరను రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గత ఏడాది అక్టోబర్ నెలలో అక్కడ నిర్వహించిన వేలంలో ఎకరా ధర రూ.177 కోట్లు పలికడం విశేషం.

అయితే రాయదుర్గంలో ఇంతగా భూముల ధరలు పలకడానికి అనేక కారణాలు ఉన్నాయి. దేశంలోనే ఐటీ హబ్‌గా బెంగళూరు సిలికాన్ సిటీకీ ధీటుగా ఎదుగుతున్న హైదరాబాద్‌లో రాయదుర్గం పేరుగాంచింది. నాలెడ్జ్‌ సిటీ, మైండ్‌ స్పేస్‌ ఐటీ పార్క్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు రాయదుర్గంలోనే ఉన్నాయి. అంతేకాకుండా గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్‌ వంటి మల్టీ నేషనల్ ఐటీ కంపెనీల క్యాంపస్‌లు దీనికి సమీపంలోనే ఉన్నాయి.

అదే సమయంలో మాదాపూర్, కొండాపూర్‌, గచ్చిబౌలి వంటి కీలక ఐటీ జోన్లకు రాయదుర్గం సెంటర్ పాయింట్‌గా ఉంది. ఔటర్‌ రింగ్‌ రోడ్డు, దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జి, హైదరాబాద్ మెట్రో.. రాయదుర్గంకు మెరుగైన కనెక్టివిటీని అందిస్తున్నాయి. వీటితోపాటు లగ్జరీ గేటెడ్‌ కమ్యూనిటీలు, హైరైజ్‌ అపార్ట్‌మెంట్లు, ఇంటర్నేషనల్ స్కూళ్లు, షాపింగ్ మాల్స్, స్టార్‌ హోటళ్లు అక్కడే ఏర్పాటు చేస్తుండటంతో రాయదుర్గం ప్రాంతంలో ఇప్పుడు భూములు భారీ ధర పలుకుతున్నాయి.