రూ.25 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఆర్డీఓ…

BB6 TELUGU NEWS CHANNEL
నారాయణపేట ఆర్డీఓ రాంచందర్‌ మంగళవారం తన కార్యాలయంలోనే నేరుగా రూ.25 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో చిక్కారు. సాక్షాత్తు రెవెన్యూ డివిజన్‌ స్థాయి అధికారి పట్టుబడడంతో జిల్లా రెవెన్యూ యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

మహబూబ్‌నగర్‌ రేంజ్‌ ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ కథనం ప్రకారం… ఊట్కూర్‌ మండలానికి చెందిన ఓ వ్యక్తి తనతో పాటు తన స్నేహితులకు సంబంధించి ఐదు జనన ధ్రువీకరణ పత్రాల కోసం గతేడాది జులైలో మీసేవ కేంద్రం ద్వారా దరఖాస్తు చేసుకున్నారు.

వాటిని ఊట్కూర్‌ తహసీల్దార్‌ కార్యాలయం నుంచి ఆర్డీఓ కార్యాలయానికి పంపించారు. దరఖాస్తుదారుడు వాటి కోసం ఆర్డీఓ కార్యాలయం చుట్టూ పదినెలలుగా తిరగాల్సి వచ్చింది. ఆరంభంలో ఒక్కో జనన ధ్రువీకరణ పత్రానికి రూ. 7500 చొప్పున లంచం డిమాండ్‌ చేసి..

చివరకు రూ. 5వేల చొప్పున రూ. 25 వేలు చెల్లించాలని ఆర్డీఓ ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.
వారి సూచన మేరకు.. మంగళవారం ఆర్డీఓ కార్యాలయంలో బాధితుడు ఆర్డీఓ రాంచందర్‌కు రూ.25 వేలు లంచం ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ అధ్వర్యంలో పట్టుకున్నారు.

కాగా ఆర్డీఓ కార్యాలయంతో పాటు నారాయణపేట జిల్లా కేంద్రం బాబాకాలనీలోని ఆయన నివాసంలో సైతం తనిఖీలు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి హైదరాబాద్‌లోని నాంపల్లి ఏసీబీ కోర్టు మొదటి అదనపు ప్రత్యేక న్యాయమూర్తి ముందు హాజరుపరుస్తామని తెలిపారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe