బ్యాంకు ఆఫీసర్లే సైబర్ దొంగలు..దేశవ్యాప్తంగా భారీ సైబర్ స్కామ్ గుట్టు రట్టు

ఆపరేషన్ ఆక్టోపస్ 2.0 : భారీ సైబర్ క్రైమ్ నెట్‌వర్క్‌ను ఛేదించిన హైదరాబాద్‌ పోలీసులు – బ్యాంకర్లతో సహా 52 మంది అరెస్ట్!

BB6 TELUGU NEWS CHANNEL
Hyderabad Police Operation Octopus 2.0 : దేశవ్యాప్తంగా సాగుతున్న భారీ సైబర్‌ మోసాల నెట్‌వర్క్‌ను హైదరాబాద్‌ పోలీసులు ఛేదించారు. 32 మంది బ్యాంకు అధికారులు, 52 మందిని అరెస్ట్ చేశారు.

Hyderabad Police Operation Octopus 2.0 : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న సైబర్ మోసగాళ్ల నెట్‌వర్క్‌పై హైదరాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. తొమ్మిది రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించిన పోలీసులు.. బ్యాంకింగ్ అధికారులే సూత్రధారులుగా సాగుతున్న భారీ సైబర్ మోసాల ముఠాను గుట్టురట్టు చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ‘ఆపరేషన్ ఆక్టోపస్ 2.0’ వివరాలను వెల్లడించారు.

9 రాష్ట్రాల్లో సోదాలు…
‘ఆపరేషన్‌ ఆక్టోపస్‌-2.O’ పేరుతో నిర్వహించిన ఈ భారీ ఆపరేషన్‌లో మొత్తం 9 రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించి, బ్యాంకు అధికారులు సహా 52 మంది నిందితులను అరెస్టు చేశారు. పెట్టుబడి స్కామ్‌లు, ట్రేడింగ్ మోసాలు, డిజిటల్ అరెస్ట్ పేరుతో అమాయకులను బెదిరించి భారీగా సొమ్ము దోచుకుంటున్న ముఠాలకు అండగా నిలుస్తున్న బ్యాంకు అధికారులే లక్ష్యంగా ఈ ఆపరేషన్ సాగింది.

నిందితుల్లో 32 మంది బ్యాంకు అధికారులు, 15 మంది మ్యూల్ ఖాతాదారులు, ఐదుగురు మధ్యవర్తులు ఉన్నారు. సైబర్‌ నేరగాళ్లతో కుమ్మక్కైన కొందరు బ్యాంకు అధికారులు.. వారి కోసం అక్రమంగా బ్యాంకు ఖాతాలు (మ్యూల్ అకౌంట్స్) తెరిచి ఇస్తున్నట్లు దర్యాప్తులో తేలింది.

హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ డీసీపీ వి. అరవింద్‌ బాబు, ఏసీపీ ఆర్‌.జి. శివ మారుతి నేతృత్వంలో 16 ప్రత్యేక బృందాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌ జరిపిన దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. బాధితుల సొమ్మును దారి మళ్లించేందుకు నేరగాళ్లు ఏకంగా 350 బ్యాంకు ఖాతాలను వినియోగించారు.

ఈ ఖాతాలకు దేశవ్యాప్తంగా నమోదైన సుమారు 850 సైబర్‌ కేసులతో సంబంధం ఉంది. వీటి ద్వారా దాదాపు రూ.150 కోట్ల మేర మోసాలు జ‌రిగిన‌ట్లు దర్యాప్తులో తేలింది.

ఆపరేషన్ ఆక్టోపస్ -1 ఫలితాల ఆధారంగా ఆపరేషన్ ఆక్టోపస్ 2.ఓ ప్రారంభించినట్లు సీపీ తెలిపారు. ఇందులో మహారాష్ట్ర, , ఢిల్లీ, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్ రాష్ట్రాలున్నాయని వివరించారు.