విద్యార్థులు, టీచర్లకు ఫేస్ రికగ్నైజేషన్ అటెండెన్స్ తప్పనిసరి – సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

BB6 TELUGU NEWS CHANNEL
విద్యా బోధనలో నాణ్యత ప్రమాణాలు పెంచాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. విద్యార్థులు, బోధన సిబ్బందికి ఫేషియల్ రికగ్నేషన్ తప్పనిసరి అని స్పష్టం చేశారు. గ్రీన్ ఛానల్లో మధ్యాహ్న భోజన బిల్లుల చెల్లింపులు చేస్తామన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి పాఠశాలలు మొదలు విశ్వ విద్యాలయాల వరకు ప్రతి విద్యా సంస్థలోనూ మెరుగైన బోధన సాగాలని,విద్యా బోధనలో నాణ్యత ప్రమాణాలు మరింతగా పెంచాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.పాఠశాలలు, కళాశాలలు, ప్రొఫెషినల్ కోర్సులు బోధించే కళాశాలల్లో విద్యార్థులు, బోధన సిబ్బందికి ఫేషియల్ రికగ్నేషన్ తప్పనిసరి చేయాలని స్పష్టంచేశారు. ముఖ గుర్తింపుతో హాజరు శాతం మెరుగవడంతో పాటు ప్రొఫెషనల్ విద్యా సంస్థల్లో లోటుపాట్లను అరికట్టవచ్చన్నారు.

విద్యా శాఖపై ఐసీసీసీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. విద్యాశాఖ పరిధిలో అదనపు గదులు, వంట గదులు,మూత్రశాలలు, మరుగుదొడ్లు, ప్రహారీల నిర్మాణం వివిధ విభాగాలు చేపట్టడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఈ నిర్మాణాలనాణ్యత ప్రమాణాలు, నిర్మాణ పర్యవేక్షణ, నిధులమంజూరు, జవాబుదారీతనానికిగానూ ఒకే విభాగం కింద ఉండాలన్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్న విద్యా, సంక్షేమ వసతుల అభివృద్ధి సంస్థ (EWIDC)కిందనే రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థల నిర్మాణాలు కొనసాగాలని సీఎం ఆదేశించారు.

మధ్యాహ్న భోజన బిల్లుల చెల్లింపును గ్రీన్ ఛానల్లో చేపట్టాలని… ఈ విషయంలో ఎటువంటి అలసత్వం చూపొద్దని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.తెలంగాణలోని మహిళా కళాశాలలు, బాలికల పాఠశాలల్లో మూత్రశాలలు, మరుగుదొడ్లు, ప్రహరీల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఆదేశించారు. కంటైనర్ కిచెన్లకు ప్రాధాన్యమివ్వాలని.. కంటైనర్లపైన సోలార్ ప్యానెళ్లతో అవసరమైన విద్యుత్ వినియోగించు కోవచ్చని తెలిపారు. క్రీడలకు ప్రాధాన్యం – సీఎం రేవంత్ రెడ్డిప్రతి పాఠశాలలో క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. అవసరమైతే కాంట్రాక్ట్ పద్ధతి వ్యాయామ ఉపాధ్యాయులను నియమించే అంశాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. అమ్మ ఆదర్శ పాఠశాలల కింద పాఠశాలల్లో పారిశుద్ధ్య పనులకు సంబంధించిన బిల్లులు తక్షణమే విడుదల చేయాలన్నారు.

సంక్షేమ గురుకుల పాఠశాలల్లోని బాలికలకు వివిధ అంశాలపై కౌన్సెలింగ్ ఇచ్చేందుకు మహిళా కౌన్సెలర్లను నియమించాలని సీఎం సూచించారు. విద్యా రంగంపై పెడుతున్న ఖర్చును తాము ఖర్చుగా కాక పెట్టుబడిగా చూస్తున్నామని తెలిపారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe