భారీగా తగ్గిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర.. ఏ నగరాల్లో రేటు ఎంతుందంటే?

BB6 TELUGU NEWS CHANNEL
Commercial Gas Cylinder Price: ఒకటో తేదీ వచ్చేసింది. గ్యాస్ సిలిండర్ ధరలు మరోసారి తగ్గాయి. అయితే ఇప్పుడు కూడా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రేట్లే (వాణిజ్య గ్యాస్ సిలిండర్) తగ్గుముఖం పట్టాయి. 19 కేజీల గ్యాస్ సిలిండర్ రేటు ప్రాంతాల్ని బట్టి రూ. 200 పైనే తగ్గుముఖం పట్టింది. హైదారబాద్‌ నగరంలో రూ. 206 తగ్గింది. ఇక డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర మాత్రం స్థిరంగానే ఉంది. ఇదేం మారలేదు.

LPG Price Cut : ఈ ఏడాదిలో పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో క్రూడాయిల్ ధరలు భారీగా పెరుగుతూ వెళ్లిన సంగతి తెలిసిందే. దీనికి అనుగుణంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో పాటుగా గ్యాస్ సిలిండర్ ధరలు కూడా భారీగా పెరిగాయి. గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరలు యుద్ధం సమయంలో స్వల్పంగానే పెరిగినప్పటికీ వాణిజ్య అవసరాల కోసం వినియోగించే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరుగుతూ వెళ్లాయి 3 నెలల కాలంలోనే దాదాపు రెట్టింపు అయ్యాయి. అయితే ఈ ధరల పెంపు నుంచి ఎట్టకేలకూ ఇప్పుడు ఉపశమనం లభిస్తోంది. వరుసగా రెండో నెలలోనూ వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరల్ని చమురు మార్కెటింగ్ కంపెనీలు తగ్గించడం విశేషం. ప్రస్తుతం ఎక్కడ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

ఆగస్ట్ 1 వ తేదీన ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు కొత్త గ్యాస్ ధరల్ని ప్రకటించాయి. ఇక్కడ చాలా ప్రాంతాల్లో సిలిండర్‌పై రూ. 200 కుపైనే తగ్గింది. అంతకుముందు జులై నెలలో కూడా వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర ప్రాంతాల్ని బట్టి రూ. 180కిపైనే తగ్గింది. ఈ 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర తగ్గడం రెస్టారెంట్లు, హోటళ్లు, ఇతర చిన్న వ్యాపారాలు చేసే వారికి ఊరట కల్పిస్తుంది.

ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో చూస్తే ధర రూ. 206 తగ్గగా 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ. 2985 వద్ద ఉంది. జులైలో ఇక్కడ రూ. 176 తగ్గగా, దానికి ముందు జనవరి నుంచి జూన్ వరకు కలిపి ఏకంగా రూ. 1500 కుపైనే పెరిగింది. ఒక దశలో జూన్ నెలలో ఈ సిలిండర్ రేటు రూ. 3367 కు చేరగా అక్కడి నుంచి తగ్గుతూ వస్తుండటం ఉపశమనం కల్పిస్తుంది. దేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్ గ్యాస్ ధర రూ. 192 తగ్గి రూ. 2738 కి పతనమైంది. ముంబైలో రూ. 194 తగ్గడంతో గ్యాస్ సిలిండర్ ధర ఇక్కడ రూ. 2691.50 గా ఉంది. చెన్నైలో రూ. 200 తగ్గి ప్రస్తుతం రూ. 2906 వద్ద ఉంది.

ఇదిలా ఉండగా ఇంట్లో వంట అవసరాల కోసం వినియోగించే గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధర మారలేదు. ఇది స్థిరంగానే కొనసాగుతోంది. ప్రస్తుతం చెన్నైలో 14.2 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 957.50 వద్ద ఉంది. ఢిల్లీలో రూ. 942, ముంబైలో రూ. 941.50 వద్ద ఉంది. ఇక హైదరాబాద్ మార్కెట్లో ఈ డొమెస్టిక్ సిలిండర్ ధర రూ. 994 వద్ద ఉంది. ప్రధాన మెట్రో నగరాల్లో చూస్తే హైదరాబాద్‌లోనే గ్యాస్ ధరలు అధికంగా ఉన్నాయి.

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe