మహబూబ్ నగర్ జిల్లా నుంచి గర్వించదగ్గ వార్త.. PHC సెంటర్ లో 108 అంబులెన్స్ పైలట్ గా విధులు నిర్వహిస్తున్న అక్బర్ కు అరుదైన గౌరవం

BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ PHC సెంటర్ లో 108 అంబులెన్స్ పైలట్ గా విధులు నిర్వహిస్తున్న అక్బర్ కు అరుదైన గౌరవం దక్కింది. విధి నిర్వహణలో చూపిస్తున్న అంకితభావం, సమయపాలన, ఉత్తమ సేవలను గుర్తించిన జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్త తన చేతుల మీదుగా అవార్డు అందించి సత్కరించారు. అర్ధరాత్రి అయినా, వాన వచ్చినా ప్రాణాలను కాపాడటమే లక్ష్యంగా పరుగులు తీస్తున్న అక్బర్ సేవలకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

సైరన్ వెనుక హీరో – 108 పైలట్ అక్బర్

ఒక ఫోన్ కాల్… అవతల గొంతులో భయం… “మా ఆమెకు నొప్పులు వస్తున్నాయ్, తొందరగా రండి” అని. ఆ కాల్ కట్ అయిన 2 నిమిషాల్లోనే స్టీరింగ్ ముందు కూర్చునేది వీళ్లే. వీళ్లకు పండగ లేదు, పబ్బం లేదు. నిద్రకు కూడా టైమ్ టేబుల్ ఉండదు.

విధి నిర్వహణలో అక్బర్

అలాంటి నిజమైన హీరోనే మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ PHC పైలట్ అక్బర్. గత కొన్నేళ్లుగా 108 పైలట్ గా వందలాది మంది గర్భిణీలను, రోడ్డు ప్రమాద బాధితులను సకాలంలో హాస్పిటల్ కు చేర్చి ప్రాణాలు నిలబెట్టాడు. అతని సమయపాలన, నిబద్ధతను గుర్తించిన జిల్లా కలెక్టర్ ఉత్తమ సేవా అవార్డుతో సత్కరించారు.

Related News

మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ కుష్బూ చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్న అక్బర్

108 పైలట్ ఉద్యోగం అంటే డ్రైవింగ్ కాదు, అది ఒక యుద్ధం.
రోడ్డు సరిగ్గా లేని తండాల్లోకి, కరెంట్ లేని అర్ధరాత్రి పొలం గట్ల మీదకు కూడా వెళ్లాలి. ఒక్క నిమిషం ఆలస్యమైతే ఒక ప్రాణం పోతుందనే టెన్షన్ స్టీరింగ్ మీదే ఉంటుంది. పేషెంట్ తో పాటు వారి కుటుంబం ఏడుపులు, అరుపుల మధ్య కూడా కూల్ గా వాహనం నడపాలి. ఆక్సిజన్, ట్రాఫిక్, టైం… అన్నీ లెక్కలోకి తీసుకోవాలి.

చాలా మందికి 108 అంటే కేవలం ఒక వాహనం. కానీ దాని వెనుక ఒక పైలట్ నిద్రలేని రాత్రులు, త్యాగం ఉంటుందని అక్బర్ లాంటి వాళ్ళను చూస్తే అర్థమవుతుంది.

సినిమాల్లో హీరోలు సైరన్ వేసుకుని వస్తారు. కానీ నిజ జీవితంలో సైరన్ వేసుకుని వచ్చి ప్రాణం పోసే హీరోలు వీరే. అక్బర్ కు BB6 తరపున హృదయపూర్వక అభినందనలు.