BB6 TELUGU NEWS CHANNEL
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు రెండో దశ విస్తరణ ఆలస్యానికి కేంద్ర ప్రభుత్వ వివక్ష, బీఆర్‌ఎస్ నేతల కుట్రలే కారణమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత కేసీఆర్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల మొదటి దశలోనే మెట్రో నిర్మాణ వ్యయం రూ.15 వేల కోట్ల నుంచి రూ.22 వేల కోట్లకు పెరిగిందని ఆరోపించారు. ప్రజలకు అవసరమైన ప్రాంతాల్లో కాకుండా స్వార్థ ప్రయోజనాల కోసమే గత పాలకులు మెట్రో మార్గాలను మళ్లించారని విమర్శించారు.
*ఎల్‌అండ్‌టీ రుణాన్ని అడ్డుకున్న కిషన్‌రెడ్డి*
మెట్రో విస్తరణ వల్ల ఏడాదికి రూ.400 కోట్ల నష్టం వస్తుందనే ఆర్థిక ఇబ్బందులతో ఎల్‌అండ్‌టీ సంస్థ ముందుకు రాలేదని సీఎం వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని ఐఆర్‌ఎఫ్‌సీ (IRFC) ద్వారా కేవలం 4 శాతం వడ్డీకే రూ.13,600 కోట్ల రుణం ఇప్పించినా, ఆ నిధులు ఎల్‌అండ్‌టీకి బదిలీ కాకుండా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అడ్డుకున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. “తెలంగాణలో రేవంత్ రెడ్డిని ప్రశాంతంగా పనిచేయనిస్తే భాజపాకు ఇబ్బంది వస్తుందని సహచర కేంద్ర మంత్రులు మనోహర్‌లాల్ ఖట్టర్, అశ్వినీ వైష్ణవ్‌లకు కిషన్‌రెడ్డి చెప్పారు” అని సీఎం వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ సహకరించినందుకు కృతజ్ఞతగా కేసీఆర్, కేటీఆర్‌లతో కలిసి కిషన్‌రెడ్డి నగర అభివృద్ధిని అడ్డుకుంటూ గురుదక్షిణ చెల్లించుకుంటున్నారని ధ్వజమెత్తారు.
*తెలంగాణపై మోదీ సర్కార్ వివక్ష*
కేంద్ర ప్రభుత్వం అహ్మదాబాద్, విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టులకు అనుమతులిచ్చి, హైదరాబాద్‌కు మాత్రం నిలిపివేసిందని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. 2023లోనే ప్రకటించిన రీజినల్ రింగ్ రోడ్డు (RRR) ఇప్పటికీ సాకారం కాలేదని గుర్తుచేశారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు, ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామన్న హామీలను నెరవేర్చడంలో ప్రధాని మోదీ పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ఈ వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ ప్రధాని మోదీ రాజీనామా చేస్తే, తాము కూడా రాజీనామా చేయడానికి సిద్ధమని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.
కేంద్రం, బీఆర్‌ఎస్ కుట్రల వల్లే మెట్రో ఫేజ్-2 జాప్యం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
15
Jun