BB6 TELUGU NEWS CHANNEL
Telangana Heavy Rain Alert : తెలంగాణకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. ఇవాళ, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Telangana Heavy Rain Alert : నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణవ్యాప్తంగా వాతావరణం వేగంగా మారుతోంది. రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (IMD) వెల్లడించింది.
పలు జిల్లాకు భారీ వర్ష సూచన:
రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తున్న రుతుపవనాల కారణంగా ఉత్తర, పశ్చిమ మరియు దక్షిణ తెలంగాణ పరిధిలోని పలు జిల్లాలపై వర్ష ప్రభావం ఎక్కువగా ఉండనుంది.హైదరాబాద్ వాతావరణ కేంద్రం బులెటిన్ ప్రకారం…. పలు జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయ్యాయి.
ఇవాళ(జూన్ 9) రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు పడొచ్చు. ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్. నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలతో పాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో బలమైన ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడొచ్చు.
రేపు(జూన్ 10) వికారాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి. మిగతా జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడొచ్చు. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
భారీ వర్షాల నేపథ్యంలో…. ప్రజలకు వాతావరణ శాఖ కీలక అలర్ట్ చేసింది. ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో ప్రజలు చెట్ల కింద గానీ, విద్యుత్ స్తంభాల సమీపంలో గానీ నిలబడకూడదని హెచ్చరించింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు, పశువుల కాపరులు వర్షం పడే సమయంలో పొలాల్లో ఉండకుండా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది.
తెలంగాణలో విస్తరిస్తున్న రుతుపవనాలు… ఇవాళ, రేపు భారీ వర్షాలు..!
09
Jun