పనులు చేసేటోళ్లనే సర్పంచ్లుగా ఎన్నుకోండి : సీఎం రేవంత్ రెడ్డి

BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్ నగర్ / కొడంగల్ : మూడు, నాలుగు రోజుల్లో సర్పంచ్ఎన్నికల షెడ్యూల్ రాబోతున్నదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను రాష్ట్ర ఎన్నికల సంఘం చేస్తున్నదని చెప్పారు. పనులు చేసేటోళ్లనే సర్పంచులుగా ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు.

“సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయి”

ప్రతి గ్రామంలో మంచోళ్లనే సర్పంచులుగా ఎన్నుకోండి. అభివృద్ధికి అడ్డుపడేటోళ్లను సర్పంచ్ చేయకండి. సర్పంచ్ ఎన్నికలు ముఖ్యమైనవి.. గ్రామ అభివృద్ధికి సర్పంచులే కీలకం. నా వద్ద కూర్చొని.. ఏం కావాలో అడిగే వారినే గెలిపించండి” అని కోరారు.

వికారాబాద్ జిల్లాలోని తన సొంత నియోజకవర్గం కొడంగల్ లో సీఎం రేవంత్ రెడ్డి సోమవారం పర్యటించారు.ఈ సందర్భంగా రూ.103 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. కొడంగల్ లో అక్షయపాత్ర ఫౌండేషన్ ఆధర్యంలో ప్రారంభించనున్న మధ్యాహ్న భోజన పథకం కోసం కిచెన్ బిల్డింగ్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం బహిరంగ సభలో సీఎం మాట్లాడారు.సర్పంచ్ ఎన్నికల రోజు ఆడబిడ్డలందరూ ఇందిరమ్మ చీరలు కట్టుకోవాలని ఆయన
పిలుపునిచ్చారు.

“సర్పంచ్ ఎన్నికల్లో ఓట్లు వేయడానికి ఇందిరమ్మ చీరలు కట్టుకొనిరండి.

‘ఇందిరమ్మ రాజ్యాన్ని ఆశీర్వదిస్తాం..ఇందిరమ్మ రాజ్యమే కావాలి’ అని ఆ చీరలు కట్టుకోవడం ద్వారా మీ అభిమానాన్ని ప్రదర్శించి, మీ సోదరుడిని ఆశీర్వదించండి. పది రకాల డిజైన్లలో ఇందిరమ్మ చీరలను తయారు చేయించాం. గత ప్రభుత్వంలో ఇచ్చిన చీరలు కంది చేనుకాడా పిట్టలను బెదిరించడానికి అడ్డం కట్టేటోళ్లు. లేదంటే బర్రెలు, గొర్రెలకు దాపు కట్టేది. కానీ మాప్రభుత్వం వచ్చాక నాణ్యమైన చీరలు అందిస్తున్నాం” అని తెలిపారు. 2034లోపు కొడంగల్ ను మోడల్ ని యోజకవర్గంగా అభివృద్ధి చేసుకుందామని, రాజకీయాలు పక్కనపెట్టి అందరూ ముందుకు రావాలని సూచించారు.

ఆడబిడ్డలు చదువుకోవాలి:
ఆడబిడ్డలు చదువుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచిం చారు. మహిళలు ఉన్నత చదువులు చదివి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు. “మహిళలకోసం తీసుకొస్తున్న సంక్షేమ పథకాలతో వాళ్లు ఆర్థికంగా ఎదుగుతున్నారు. మహిళా సంఘాల సభ్యులను ఆర్థికంగా నిలబెట్టాలని వెయ్యి బస్సులకు వాళ్లను యజమానులుగా చేశాం. అదానీ,అంబానీలతో పోటీ పడే విధంగా సోలార్పవర్ ప్లాంట్లను, పెట్రోల్ బంక్ లను అప్పగిస్తున్నాం. మన ఆడబిడ్డలు తయారుచేసే వస్తువులను ఉత్పత్తి చేసి ప్రపంచ మార్కెట్లో అమ్మడానికి హైదరాబాద్ హైటెక్సిటీలో మూడున్నర ఎకరాలు ఇచ్చాం. ఆడబిడ్డలు తయారు చేస్తున్న వస్తువులు150 షాపుల్లో
అమ్ముడవుతున్నాయి. ప్రపంచ పర్యాటకులు వచ్చి వస్తువులు కొంటున్నారు. అమెజాన్ ద్వారా అమెరికాలో ఉండే వారు కూడా మన వస్తువులు కొనడానికి ఏర్పాట్లు చేస్తున్నాం”అని వెల్లడించారు.

మీ పిల్లల ఆకలి తీరుస్తాం.
ఎన్ని చేసినా కుటుంబ కష్టాలు సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అవి తీరాంటే పిల్లలు చదువు కోవాలన్నారు. అందుకు కొడంగల్ను ప్రయోగశాలగా మారుస్తున్నామన్నారు. “మీ పిల్లలు చదువుకొని వెలుగులోకి రావాలి. అందుకు వాళ్లు బడులకు రావాలి. అక్షయపాత్రతో మాట్లాడి ఈ విద్యా సంవత్సరం మొదటి నుంచే కొడంగల్ నియోజకవర్గంలోని 312 బడుల్లో చదువుకుంటున్న 28 వేల మంది పిల్లలకు టిఫిన్ పెట్టిస్తున్నాం. దీంతో బడుల్లో 5 వేలమంది పిల్లలు పెరిగారు. ఇప్పుడు మధ్యాహ్న భోజనం కూడా అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఈమేరకు కిచెన్బల్డింగ్ నిర్మాణానికి భూమి పూజ చేశాం. త్వరలో ఈ పథకాన్ని ప్రారంభించి మీ పిల్లల ఆకలి తీర్చి తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వామ్యం చేస్తాం” అని తెలిపారు.
కరువు ప్రాంతంలో కృష్ణా జలాలు పారిస్తాం..ఎడ్యుకేషన్, ఇరిగేషన్కు మొదటి ప్రాధాన్యం ఇస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇందులో భాగంగా రూ.5 వేలకోట్లతో కొడంగల్, నారాయణపేట, మక్తల్ లిఫ్ట్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. కొడంగల్ ను డెవలప్ చేస్తాం. రానున్న 16నెలల్లో కొడంగల్ ను అంతర్జాతీయ స్థాయి ఎడ్యుకేషన్హబ్ గా తీర్చిదిద్దుతాం” అని
అన్నారు.

70 ఏండ్ల కల నెరవేరనుంది.
త్వరలో ఈ ప్రాంతవాసులు రైలు కూతను వింటారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.70 ఏండ్లుగా ఎదురు చూస్తున్న విరాకాబాద్-కృష్ణా రైల్వే లైను ఆమోదం లభించిందని చెప్పారు. రాష్ట్ర వాటా నిధులు కూడా ఇచ్చామన్నారు. “ఈప్రాంతంలో ఎక్కువగా సున్నపురాయి గనులు ఉన్నాయి. త్వరలో ఈ ప్రాంతంలో సిమెంట్ పరిశ్రమను స్థాపిస్తాం. దీంతో యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. కొడంగల్ నియోజక వర్గానికి అంతర్జాతీయ స్థాయి పరిశ్రమలు వస్తాయి.

లగచర్ల, హకీంపేట, పోలేపల్లి ప్రాంతాల్లో రైతులు నాలుగు వేల ఎకరాల భూములను ఇచ్చారు.గతంలో కొందరు కుట్రలు చేసి రైతులను రెచ్చగొట్టారు. ఇప్పుడు రైతులు అడిగినంత పరిహారం ఇచ్చాం. ఇండ్లు కూడా ఇస్తున్నాం. ఢిల్లీ పక్కనే ఉన్న నోయిడా తరహాలో.. తెలంగాణ నోయిడాగా కొడంగల్ నియోజకవర్గాన్ని అభివృద్ధిచేస్తాం” అని చెప్పారు. కాగా, సభ అనంతరం నియోజకవర్గంలోని మహిళా సంఘాలకు రూ.300 కోట్ల వడ్డీ లేని రుణాలను సీఎం అందజేశారు. మహిళా సంఘాల సభ్యులకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. అలాగే పెట్రోల్బంక్ ప్రోసీడింగ్ ఆoదజేశారు.

కొడంగల్, మక్తల్, నారాయణపేట నియోజకవర్గాల్లో బీడు భూములను సాగులోకి తేవాలనే ఉద్దేశంతో లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కృష్ణా జలాలను తరలిస్తున్న అపర భగీరథుడు సీఎం రేవంత్ రెడ్డి అని మంత్రులు దామోదర రాజనర్సింహ, వాకిటి శ్రీహరి కొనియాడారు. నీటిని తరలించడం ఆనాడు రాజశేఖర్ రెడ్డికి, ఈనాడు రేవంత్రెడ్డికే సాధ్యమైందని అన్నారు. రానున్న రోజుల్లో కొడంగల్ అద్భుతంగా అభివృద్ధి చెందబోతున్నదని పేర్కొన్నారు. “రేవంత్రెడ్డిని కొడంగల్ ప్రజలు ఎన్నుకోవడం. తెలంగాణ ప్రజల అదృష్టం. సీఎం కమిట్మెంట్, సేవా దృక్పథం,దార్శనికత్వంతో కొడంగల్ ఆదర్శ నియోజకవర్గంగా నిలిచిపోతుంది” అని అన్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe