డ్రగ్ మాఫియా ఆర్థిక మూలాలపై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. రూ.6.55 కోట్ల ఆస్తుల జప్తు

ఫాలో ద మనీ విధానంతో దెబ్బ.. కొకైన్ ఎండీఎంఏ నెట్ వర్క్ ఆస్తులు సీజ్

BB6 TELUGU NEWS CHANNEL: తెలంగాణలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా ఆర్థిక మూలాలపై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం మోపింది. కొకైన్, ఎండీఎంఏ అక్రమ రవాణా నెట్ వర్క్ పై చేపట్టిన దర్యాప్తులో కీలక పురోగతి సాధించింది. డ్రగ్స్ స్వాధీనంతో పాటు అక్రమ ఆదాయంతో సమకూర్చుకున్న ఆస్తులను గుర్తించి ఆర్థిక దర్యాప్తు ద్వారా రూ.6.55 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది.

సైబరాబాద్ నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో భాగంగా ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి 16.50 గ్రాముల కొకైన్, 52.29 గ్రాముల ఎండీఎంఏ, 8 మొబైల్ ఫోన్లు, 3 ల్యాప్ టాప్ లు, 2 పెన్ డ్రైవ్ లు, రూ.45 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.

దర్యాప్తులో భాగంగా నిందితులు, వారి సహచరులు, బంధువులకు సంబంధించిన ఆస్తులను గుర్తించారు. వీటిలో రూ.55.36 లక్షల విలువైన చరాస్తులు, రూ.2.96 కోట్ల ప్రభుత్వ విలువ కలిగిన స్థిరాస్తులు ఉన్నాయి. వీటి ప్రస్తుత మార్కెట్ విలువ సుమారు రూ.6 కోట్లుగా అంచనా వేశారు. మొత్తం విలువ సుమారు రూ.6.55 కోట్లుగా తేలింది.

చెన్నైలోని సంబంధిత సమర్థ అధికార సంస్థ ధ్రువీకరణ అనంతరం గుర్తించిన ఆస్తులను 15.09.2026న జప్తు చేశారు. డబ్బును అనుసరించండి, డ్రగ్ నెట్ వర్క్ ను ఛేదించండి అనే విధానంతో ఈగల్ ఫోర్స్ దర్యాప్తు కొనసాగిస్తోంది.

మాదకద్రవ్యాల వ్యతిరేక పోరాటంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈగల్ ఫోర్స్ విజ్ఞప్తి చేసింది. అనుమానాస్పద కార్యకలాపాలపై వెంటనే సమాచారం అందించాలని కోరింది.