రంగారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆరుగురిని కత్తితో పొడిచి హత్య

BB6 TELUGU NEWS CHANNEL
షాబాద్: రంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. షాబాద్ మండలం దైవాలగూడలో రాజ్‌కుమార్ అనే వ్యక్తి ఆరుగురిని కత్తితో పొడిచి హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. పోక్సో కేసు నమోదు చేయించారనే కక్షతో నిందితుడు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం.

పోలీసుల వివరాల ప్రకారం, రాజ్‌కుమార్‌పై మే 16న బాధిత బాలిక తల్లి పోక్సో కేసు పెట్టారు. ఈ కేసులో అరెస్టయిన రాజ్‌కుమార్ ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చాడు. తనపై కేసు పెట్టిన కుటుంబంపై కక్ష పెంచుకున్న అతడు పథకం ప్రకారం దాడికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఈ దాడిలో బాధిత బాలికతో పాటు ఆమె తల్లి, నానమ్మను రాజ్‌కుమార్ హత్య చేసినట్లు సమాచారం. అలాగే తన భార్య, ఇద్దరు పిల్లలను కూడా హత్య చేసినట్లు తెలుస్తోంది. మొత్తం ఆరుగురిని కత్తితో పొడిచి చంపిన అనంతరం నిందితుడు తన తల్లిదండ్రులకు ఫోన్ చేసినట్లు సమాచారం.

ఫోన్‌లో తాను ఆరుగురిని హత్య చేసినట్లు చెప్పిన రాజ్‌కుమార్, తాను కూడా ఆత్మహత్య చేసుకుంటానని చెప్పినట్లు తెలుస్తోంది. అనంతరం అతడు పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో విస్తృతంగా గాలిస్తున్నారు.

ఘటనాస్థలికి పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి, డీసీపీ యోగేష్ గౌతమ్ చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. హత్యలకు దారితీసిన పరిస్థితులు, నిందితుడి కదలికలు, ఘటనకు ముందు జరిగిన పరిణామాలపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఒకేసారి ఆరుగురు హత్యకు గురికావడంతో దైవాలగూడలో తీవ్ర విషాదం నెలకొంది.

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe