BB6 TELUGU NEWS CHANNEL:
ఏపీలో మరో విప్లవాత్మక నిర్ణయానికి చంద్రబాబు సర్కార్ శ్రీకారం చుట్టింది. ఆధార్ కార్డు తరహాలో ఏపీలోని కుటుంబాలన్నింటికీ.. ఫ్యామిలీ బెనిఫిట్ కార్డును అందించాలని.. కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం నుంచి ఒక్క కుటుంబానికి అందుతున్న పథకాలు సహా అనేక వివరాలను ఆ ఒక్క ఫ్యామిలీ కార్డులోనే నమోదు చేయాలని అధికారులను ఆదేశించింది. మరోవైపు.. త్వరలోనే ఏపీలో పాపులేషన్ పాలసీని తీసుకురావాలని సీఎం చంద్రబాబు అధికారులతో చర్చించారు.
ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న టీడీపీ-జనసేన-బీజేపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం.. అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజలకు మేలు చేసేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తాజాగా గురువారం ఫ్యామిలీ బెనిఫిట్ మానిటరింగ్ వ్యవస్థపై సచివాలయంలో సమీక్ష చేపట్టారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికీ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు అందించాలని నిర్ణయం తీసుకున్నారు.
ఆధార్ కార్డు లాగే ఉండే ఈ ఫ్యామిలీ కార్డులో ఆ కుటుంబానికి సంబంధించిన మొత్త సమాచారం అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఆ కుటుంబానికి ప్రభుత్వం నుంచి అందే సంక్షేమ పథకాలు సహా పూర్తి వివరాలను ఆ ఫ్యామిలీ కార్డులో పొందుపరచాలని.. ఇక అందులోని వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలని సంబంధిత అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్రంలో ఉన్న ప్రతీ ఒక్క కుటుంబానికి సంబంధించిన అవసరాలపై.. గ్రామస్థాయిలో సమాచారాన్ని సేకరించాలని అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఒకవేళ ఆయా కుటుంబాలకు ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు అవసరమైతే.. వాటిని వెంటనే వారికి అందేలా ఒక వ్యవస్థను సిద్ధం చేయాలని సూచించారు. ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాల కోసం.. కుటుంబాలు విడిపోయే పరిస్థితి రాకూడదని చంద్రబాబు పేర్కొన్నారు. అందుకే అందరికీ లబ్ధి చేకూర్చేలా పథకాలను రీడిజైన్ చేసే అంశాన్ని పరిశీలిద్దామని స్పష్టం చేశారు. అదే సమయంలో త్వరలోనే రాష్ట్రంలో పాపులేషన్ విధానాన్ని తీసుకురావాలని అధికారులకు చంద్రబాబు తేల్చి చెప్పారు.
ప్రభుత్వం తరఫున ప్రతీ కుటుంబానికి అందే పథకాలు, ఇతర సహాయాలకు సంబంధించిన సమాచారం మొత్తాన్ని ఆ ఫ్యామిలీ కార్డులో పొందుపరచాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. ఆధార్ కార్డు లాగే ఫ్యామిలీ కార్డును కూడా అధికారులు, ప్రభుత్వం, ప్రజలు ఉపయోగించుకోవాలని హితవు పలికారు. ఫ్యామిలీ కార్డులోని సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలని సూచించారు. ప్రజలకు సంబంధించిన పూర్తి సమాచారం ఆ ఫ్యామిలీ కార్డులో అందుబాటులో ఉండాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.
ఆధార్ కార్డు తరహాలో ఏపీలో ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు, ఇక అన్నీ ఒకేదగ్గర.. చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం.
29
Aug