BB6 TELUGU NEWS CHANNEL
తెలంగాణలో గంజాయి మాఫియా ఆర్థిక మూలాలపై ఈగల్ ఫోర్స్ భారీ దెబ్బ కొట్టింది. కేవలం గంజాయి స్వాధీనంతో ఆగకుండా, డ్రగ్స్ డబ్బుతో కొన్న ఆస్తులను కూడా జప్తు చేసి, ఫర్ఫైట్ చేసింది.
మహేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో ఈగల్ ఫోర్స్ కీలక చర్య తీసుకుంది. ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలోని మహేశ్వరం పోలీసులు, ఈగల్ ఫోర్స్ లీగల్ వింగ్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టారు.
2024లో నమోదైన క్రైమ్ నంబర్ 415/2024 కేసులో మహ్మద్ మౌలానా, మహ్మద్ ముస్తఫా అనే ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 62 కిలోల 428 గ్రాముల గంజాయి, ఒక టాటా ఏస్ వాహనం, 10 వేల రూపాయల నగదు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
అయితే పోలీసులు ఇక్కడితో ఆగలేదు. “ఫాలో ద మనీ” అంటే డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి వెళ్లింది అనే కోణంలో దర్యాప్తు చేశారు. ఎన్డీపీఎస్ చట్టంలోని సెక్షన్ 68ఎఫ్ కింద ఆర్థిక దర్యాప్తు చేపట్టారు.
ఈ దర్యాప్తులో నిందితుడు మహ్మద్ మౌలానాకు చెందిన బ్యాంక్ ఖాతాలో ఉన్న 4,022 రూపాయలను ఫ్రీజ్ చేశారు. అలాగే డ్రగ్స్ సొమ్ముతో కొన్నట్టుగా భావిస్తున్న నాలుగు వాహనాలను గుర్తించారు. అందులో టాటా ఏస్ గూడ్స్ క్యారియర్, ఒక ఆటో రిక్షా, రెండు మోటార్ సైకిళ్లు ఉన్నాయి. వీటి మార్కెట్ విలువ సుమారు 7 లక్షల రూపాయలు.
మొత్తంగా 7 లక్షల 4 వేల 22 రూపాయల విలువైన ఆస్తులను గుర్తించారు.
చెన్నైలోని కాంపిటెంట్ అథారిటీ నిర్ధారణ తర్వాత, ఈ ఆస్తులను 2026 నవంబర్ 4వ తేదీన ఎన్డీపీఎస్ చట్టం సెక్షన్ 68(ఎఫ్) కింద ఫర్ఫైట్ చేశారు. అంటే ప్రభుత్వానికి స్వాధీనం అయ్యేలా చర్యలు తీసుకున్నారు.
గంజాయి పట్టుకోవడం మాత్రమే కాదు, గంజాయి వ్యాపారంతో సంపాదించిన ప్రతి రూపాయిని, ప్రతి ఆస్తిని వెంటాడుతామని ఈగల్ ఫోర్స్ స్పష్టం చేసింది. డ్రగ్స్ అమ్మి సంపాదించి ఆస్తి కొంటే అది మిగలదని హెచ్చరించింది.
డ్రగ్స్ సమాచారం ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 1908 కు, లేదా వాట్సాప్ నంబర్ 87126 71111 కు తెలియజేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఈగల్ ఫోర్స్ విజ్ఞప్తి చేసింది.
గంజాయి సొమ్ముతో కొన్న ఆస్తులు మాయం! ఈగల్ ఫోర్స్ భారీ షాక్
05
Nov