కేంద్ర పథకాల చెల్లింపుల్లో భారీ మార్పు – ఆధార్ స్థానంలో ఓటర్ ఐడీ, బయోమెట్రిక్

BB6 TELUGU NEWS CHANNEL
కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియలో కీలక మార్పులు రానున్నాయి. ఇప్పటివరకు నిధుల జమకు కీలకంగా ఉన్న ఆధార్ స్థానంలో ఓటర్ ఐడీని తీసుకురానున్నట్లు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లలన్ సింగ్ ప్రకటించారు.

కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అక్టోబర్ 30న న్యూఢిల్లీలో జరిగిన ‘పీపుల్స్ ప్లాన్ క్యాంపెయిన్ 2026-27’ జాతీయ వర్క్‌షాప్‌లో కేంద్ర మంత్రి ఈ ప్రకటన చేశారు. ఈ వ్యాఖ్యలను ఆయన నవంబర్ 3న గ్యాంగ్‌టక్‌లో మరోసారి పునరుద్ఘాటించారు.

ఇప్పటివరకు ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు చెల్లింపులు ఆధార్ నంబర్ ఆధారంగా జరుగుతుండగా, ఇకపై ఆ విధానం మారనుంది. ఆధార్ ఇకపై చెల్లింపులకు ప్రాతిపదిక కాదని, దాని స్థానంలో ఓటర్ ఐడీలోని EPIC నంబర్, బయోమెట్రిక్ అథెంటికేషన్ ఆధారంగానే నగదు బదిలీ జరుగుతుందని మంత్రి స్పష్టం చేశారు.

పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ పరిధిలోని సంక్షేమ పథకాలకు ఈ కొత్త విధానం వర్తిస్తుందని కేంద్ర మంత్రి తెలిపారు.

ఎందుకు ఈ మార్పు?:
ఆధార్ కార్డులు సులభంగా అందుబాటులోకి రావడం, నకిలీ లబ్ధిదారులు చేరడం.
ఓటర్ ఐడీలోని EPIC నంబర్ + బయోమెట్రిక్ ద్వారా అనర్హులను ఏరివేయడం.
పారదర్శకత పెంచి, అర్హులకే పథకాలు చేరేలా చేయడం – ఇదే ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి పేర్కొన్నారు.

అయితే ఈ కొత్త విధానం ఏయే పథకాలకు వర్తిస్తుంది, ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది అనే విషయాలపై కేంద్ర మంత్రి పూర్తి వివరాలు వెల్లడించలేదు. ముఖ్యంగా మత్స్య, పశుసంవర్ధక, డెయిరీ శాఖ పథకాల్లో ఈ మార్పు ప్రభావం ఎక్కువగా ఉండనుందని సమాచారం.

ఆధార్ స్థానంలో ఓటర్ ఐడీ – ఈ నిర్ణయం కోట్లాది మంది లబ్ధిదారులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.