BB6 TELUGU NEWS CHANNEL
Operation Kavach | నగర అంతర్గత భద్రతను మరింత పటిష్టం చేయడంతో పాటు అసాంఘిక శక్తుల కదలికలను ముందస్తుగా గుర్తించి అరికట్టే లక్ష్యంతో హైదరాబాద్ సిటీ పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి ‘ఆపరేషన్ కవచ్’ పేరిట విస్తృత తనిఖీలు నిర్వహించారు. నగరంలోని హోటళ్లు, లాడ్జీలను లక్ష్యంగా చేసుకుని చేపట్టిన ఈ ప్రత్యేక సోదాల్లో సుమారు 5వేల మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు

Operation Kavach | నగర అంతర్గత భద్రతను మరింత పటిష్టం చేయడంతో పాటు అసాంఘిక శక్తుల కదలికలను ముందస్తుగా గుర్తించి అరికట్టే లక్ష్యంతో హైదరాబాద్ సిటీ పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి ‘ఆపరేషన్ కవచ్’ పేరిట విస్తృత తనిఖీలు నిర్వహించారు. నగరంలోని హోటళ్లు, లాడ్జీలను లక్ష్యంగా చేసుకుని చేపట్టిన ఈ ప్రత్యేక సోదాల్లో సుమారు 5వేల మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. రాత్రి 11 గంటల నుంచి ఒంటిగంట వరకు కొనసాగిన ఈ ఆపరేషన్‌లో కమిషనరేట్ పరిధిలోని ఏడు జోన్లలో మొత్తం 562 హోటళ్లు, లాడ్జీల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. హోటల్ రిజిస్టర్లు, అతిథుల వివరాలు, గుర్తింపు కార్డులు, గదుల కేటాయింపు విధానం, సీసీటీవీ వ్యవస్థల పనితీరు వంటి అంశాలను పోలీసులు పరిశీలించారు.

ఈ ఆపరేషన్‌ను నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ స్వయంగా పర్యవేక్షించారు. నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని, అమీర్‌పేట ప్రాంతంలోని పలు లాడ్జీలను ఆయన సందర్శించి తనిఖీలు నిర్వహించారు. గదుల కేటాయింపు విధానం, విజిటర్ల వివరాల నమోదు ప్రక్రియను పరిశీలించిన ఆయన, అక్కడ బస చేస్తున్న పలువురు అతిథులతో నేరుగా మాట్లాడి వారి స్వస్థలాలు, నగరానికి వచ్చిన ఉద్దేశాలు తదితర వివరాలు తెలుసుకున్నారు. ఆపరేషన్ కవచ్‌లో భాగంగా అత్యధికంగా ఖైరతాబాద్ జోన్‌లో 119 హోటళ్లు, లాడ్జీలను తనిఖీ చేశారు.
శంషాబాద్ జోన్‌లో 92, జూబ్లీహిల్స్, గోల్కొండ జోన్లలో 86 చొప్పున, సికింద్రాబాద్ జోన్‌లో 82, రాజేంద్రనగర్ జోన్‌లో 53, చార్మినార్ జోన్‌లో 44 హోటళ్లు, లాడ్జీల్లో సోదాలు నిర్వహించారు. లా అండ్ ఆర్డర్, క్రైమ్, ప్రత్యేక విభాగాల పోలీసులు సమన్వయంతో వ్యవహరిస్తూ రికార్డులు, గదులు, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. తనిఖీల అనంతరం హోటళ్లు, లాడ్జీల నిర్వాహకులకు సీపీ సజ్జనర్ పలు సూచనలు జారీ చేశారు. అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడంలో నిర్వాహకుల పాత్ర కీలకమని పేర్కొంటూ, ప్రతి అతిథి నుంచి ఒరిజినల్ గుర్తింపు కార్డును పరిశీలించి, స్పష్టమైన ప్రతిని భద్రపరచాలని ఆదేశించారు.
రిజిస్టర్లలో అతిథుల పూర్తి వివరాలు, ఫోన్ నంబర్లు, చెక్-ఇన్, చెక్-అవుట్ సమయాలను తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు. అసంపూర్ణమైన, తప్పుడు సమాచారంతో ఎట్టి పరిస్థితుల్లోనూ గదులు కేటాయించొద్దని హెచ్చరించారు. మైనర్లకు గదులు ఇవ్వకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, గుర్తింపు కార్డుల ఆధారంగా వయస్సును నిర్ధారించుకోవాలని స్పష్టం చేశారు. సాంకేతికతను వినియోగించి భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా త్వరలోనే డిజిటల్ విజిటర్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపడుతున్నట్లు సీపీ వెల్లడించారు. ఈ వ్యవస్థ ద్వారా హోటళ్లలో బస చేసే వారి వివరాలను మరింత సమర్థవంతంగా పర్యవేక్షించే అవకాశం ఉంటుందని తెలిపారు.
హోటల్, లాడ్జీ ప్రాంగణాల్లో ముఖ్యంగా ప్రవేశ, ఎగ్జిట్ ద్వారాలు, రిసెప్షన్ ప్రాంతాలు స్పష్టంగా కనిపించేలా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. అన్ని కెమెరాలు నిరంతరాయంగా పనిచేసేలా నిర్వాహకులు చర్యలు తీసుకోవాలన్నారు. ఎవరైనా అనుమానాస్పదంగా ప్రవర్తించినా లేదా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే సూచనలు కనిపించినా వెంటనే డయల్-100, సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని కోరారు. భద్రతా నిబంధనలను పాటించని హోటల్, లాడ్జీ నిర్వాహకులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. నగరంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఆపరేషన్‌లో అదనపు సీపీలు, జాయింట్ సీపీలు, వివిధ జోన్ల డీసీపీలు, ఏసీపీలు, సైబర్ క్రైమ్, విమెన్ సేఫ్టీ విభాగాల అధికారులు సహా పెద్ద సంఖ్యలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Related News
