BB6 TELUGU NEWS CHANNEL
TG Cheyutha Pensions : చేయూత పింఛన్ల పంపిణీలో అక్రమాలను అరికట్టేందుకు తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై లబ్ధిదారులకు నగదు ఇవ్వకుండా నేరుగా బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయాలని నిర్ణయించింది.
పెన్షన్ల పంపిణీ విధానంలో రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. పింఛన్ల పంపిణీలో జరుగుతున్న అక్రమాలకు శాశ్వతంగా అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ఇకపై లబ్ధిదారులకు నగదు రూపంలో ఇచ్చే చెల్లింపులను పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించింది. ఈ మేరకు పెన్షన్ మొత్తాలను నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఇటీవలనే ఆదేశించారు. ఫలితంగా ఇకపై ప్రతినెలా లబ్ధిదారుల చేతికి నగదు ఇచ్చే పాత పద్ధతికి తెరపడనుంది.
ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, చేనేత, గీత కార్మికులు, ఒంటరి మహిళలు సహా వివిధ వర్గాలకు చెందిన సుమారు 42 లక్షల మంది లబ్ధిదారులు చేయూత పథకం కింద పింఛన్లు పొందుతున్నారు. వీరిలో దాదాపు సగం మంది లబ్ధిదారులకు ఇప్పటికే బ్యాంక్ ఖాతాల ద్వారానే నిధులు నేరుగా అందుతున్నాయి. అయితే…. నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులు, కొందరు దివ్యాంగులకు స్థానిక పంచాయతీ కార్యదర్శులు, బిల్ కలెక్టర్లు ప్రతి నెల వీళ్లకి నగదు రూపంలో పింఛన్ డబ్బులను అందిస్తున్నారు. మరికొందరు లబ్ధిదారులు ప్రతినెలా తపాలా (పోస్టల్) ఖాతాల ద్వారా తమ సొమ్మును డ్రా చేసుకుంటున్నారు.
అవకతవకలకు చెక్…!
ఇంటింటికీ వెళ్లి నగదు పంపిణీ చేసే విధానంలో పెద్ద ఎత్తున అవకతవకలు, అక్రమాలు జరుగుతున్నట్లు ప్రభుత్వానికి క్షేత్రస్థాయి నుంచి వరుసగా ఫిర్యాదులు అందాయి. కొందరు అధికారులు లబ్ధిదారులకు పూర్తి మొత్తాన్ని ఇవ్వకుండా చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. మరోవైపు….. పోస్టల్ కార్యాలయాల ద్వారా పెన్షన్ తీసుకునే వృద్ధులు, మహిళలు తమ సొమ్ము కోసం గంటల తరబడి ఎండలో క్యూలైన్లలో నిలబడి తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఈ సమస్యలన్నింటికీ శాశ్వత పరిష్కారం చూపాలని సర్కార్ భావిస్తోంది.
అర్హులైన ప్రతి ఒక్కరికీ రూపాయి కూడా దుర్వినియోగం కాకుండా పూర్తి స్థాయిలో పెన్షన్ అందాలన్న ఉద్దేశంతో, అన్ని రకాల పింఛన్లను లబ్ధిదారుల వ్యక్తిగత ఖాతాల్లోనే వేయాలని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) అధికారులు తక్షణమే రంగంలోకి దిగి ఏర్పాట్లు ప్రారంభించారు. ప్రస్తుతం చేతికి నగదు రూపంలో పింఛన్ తీసుకుంటున్న లబ్ధిదారులందరికీ కొత్తగా ‘ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్’ (పోస్టల్ బ్యాంక్) ఖాతాలను తెరిపించాలని నిర్ణయించారు.
ఏటీఎంల ద్వారా ఎప్పుడైనా విత్ డ్రా
కొత్తగా తెరిచే ఈ పోస్టల్ బ్యాంక్ ఖాతాల్లో జమయ్యే పింఛన్ డబ్బులను లబ్ధిదారులు తమకు వీలైనప్పుడు, అవసరమైనప్పుడు నేరుగా బ్యాంకుకు వెళ్లి గానీ లేదా ఏటీఎం కేంద్రాల ద్వారా గానీ సులభంగా విత్ డ్రా చేసుకోవచ్చు. దీనివల్ల పోస్టాఫీసుల వద్ద గంటల తరబడి వేచి చూడాల్సిన అవస్థలు తప్పుతాయి.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారుల గుర్తింపును మరింత పారదర్శకంగా మార్చేందుకు ‘లైవ్ అథెంటికేషన్’ ప్రక్రియను అధికారులు నిర్వహిస్తున్నారు. అర్హులైన లబ్ధిదారులు బతికే ఉన్నారా లేదా అనే విషయంతో పాటు వారి వివరాలను క్షేత్రస్థాయిలో సరిచూస్తున్నారు.
ఈ జూన్ నెలాఖరు నాటికి ఈ లైవ్ అథెంటికేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని సెర్ప్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రక్రియ ముగిసిన అనంతరం…. రాబోయే ఆగస్టు నెల నుంచి పింఛన్ దారులందరి ఖాతాల్లోకి నేరుగా నగదు బదిలీ (DBT) విధానంలో డబ్బులు జమ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ ఇది ఆలస్యమైతే…. సెప్టెంబర్ నెల నుంచైనా అమల్లోకి రావొచ్చు…!
చేయూత పెన్షన్ ఇకపై చేతికి నగదు బంద్..! రాబోయే కొత్త మార్పులివే
04
Jun