సురక్ష పోలీసు కళాబృందం & మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం(AHTU Team)” వారి సంయుక్త సామాజిక అవగాహన కార్యక్రమం

మహబూబ్ నగర్ జిల్లా పోలీసు.సురక్ష పోలీసు కళాబృందం.జిల్లా ఎస్.పి. శ్రీమతి డి. జానకి ఆదేశాల మేరకు…
మహబూబ్ నగర్ జిల్లా, మహమ్మదాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నంచర్ల “సురక్ష పోలీసు కళాబృందం” మరియు “మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం(AHTU Team)” వారి సంయుక్త సామాజిక అవగాహన కార్యక్రమం. బాలబాలికలు చదువుపై దృష్టి పెట్టి, పెద్దలు విలువలతో కూడిన జీవనవిధానంతో  క్రమశిక్షణతో కృషి చేయడం వలన ఉత్తమ భవిష్యత్తు లభిస్తుందని పాటలు, మాటలతో పోలీసు కళా బృందం సభ్యులు ప్రజలకు వివరించారు.సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించారు. సైబర్ నేరగాళ్లు చూపే మోసపూరిత ఆశలు, గిఫ్ట్ లు వచ్చాయని, మీరు లక్కీ డ్రా లో గెలుపొందారని, ఆన్లైన్లో తక్కువ ధరకే వాహనాలు, వస్తువులు దొరుకుతాయని మోసం చేయడం జరుగుతుంది. అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసి మీ పేరు మీద మా యాప్ లో లోన్  వచ్చిందని లేదా మీకు QR కోడ్ పంపించి దానిని స్కాన్ చేస్తే మీకు డబ్బులు వస్తాయని చెప్పిన యెడల నమ్మకండి. అది సైబర్ మోసం అని తెలుసుకోండి. ఇంటర్నెట్లో ఓటీపీ నంబర్ గానీ బ్యాంక్ కార్డ్స్ నంబర్ గానీ ఎవరికీ పంపవద్దని, ఒకవేళ ఎవరైనా సైబర్ నేరానికి గురైనట్లయితే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930 కి లేదా మహబూబ్ నగర్ జిల్లా పోలీసు కంట్రోల్ రూమ్ నంబర్ 8712659360 కి లేదా సంబంధిత పోలీసు స్టేషన్ కు కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.
గంజాయి మొదలగు మత్తు పదార్థాల అక్రమ రవాణా మరియు వినియోగం వలన భవిష్యత్తులో యువత ప్రమాదంలో పడుతుందని, మత్తు పదార్థాల బారిన పడి ఎంతోమంది యువత భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారుతోందని, కొంతమంది యువత జల్సా జీవితంతో పాటు సులభంగా డబ్బు సంపాదన కోసం అక్రమ మార్గంలో గంజాయితో పాటు ఇతర మత్తు పదార్థాలను(Drugs) విక్రయిస్తూ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని తెలిపారు. అలాంటి నేరస్తులతో పాటు, మత్తు పదార్థాలను వినియోగించే వ్యక్తులకు చట్టపరమైన శిక్షలు తప్పవని, సమాజంలోని మనందరం కలిసికట్టుగా పనిచేస్తూ భవిష్యత్తులో మహబూబ్ నగర్ జిల్లాను గంజాయి రహిత జిల్లాగా మార్చాలన్న జిల్లా ఎస్.పి. శ్రీమతి డి.జానకి గారి సంకల్పాన్ని తెలియజేశారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా మరియు అమ్మకాల సమాచారాన్ని సంబంధిత పోలీసు స్టేషన్ కు గానీ, జిల్లా పోలీస్ కంట్రోల్ రూం నెంబర్ 8712659360 కి గానీ మరియు drugfreembnr.police@gmail.com మెయిల్ కి సమాచారం ఇవ్వగలరని చెప్పారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయి అని అన్నారు.బాల్య వివాహాల వలన అనేక అనర్థాలు జరగుతున్నాయని, ఎవరూ బాల్య వివాహాలు చేసుకోవద్దని, ఎవరైనా అలా చేయాలని ప్రయత్నించినచో చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్-1098 కు ఫోన్ చేయాలని కోరారు. అలాగే యువత సామాజిక మాధ్యమాలు, మొబైల్ ఫోన్లు, మద్యం వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని తెలియజేస్తూ మైనర్లు, లైసెన్సు లేనివారు, మద్యం తాగినవారు ఎలాంటి వాహనం నడిపకూడదని, రోడ్డు ప్రమాదాల వలన అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని, వాటిని మనందరం నివారించేందుకు కృషి చేద్దామని తెలిపారు. రకరకాల పద్దతులలో మాయమాటలు చెప్పి పిల్లలను, అమ్మాయిలను, యువతను, మహిళలను అక్రమ రవాణా చేసే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని, అలాంటి అనుమానితులు ఉంటే వెంటనే సంబంధిత పోలీసులకు లేదా డయల్-100కు ఫోన్ చేసి తెలియజేయాలని తెలిపారు.మన జిల్లా ప్రజలు ముఖ్యంగా యువత, బాలబాలికలు గొప్పగా ఎదగాలన్న జిల్లా ఎస్.పి. శ్రీమతి డి.జానకి గారి సందేశాన్ని పోలీసులు విద్యార్థులకు వినిపించారు.
కార్యక్రమంలో మహమ్మదాబాద్ పోలీసు స్టేషన్ నుండి పోలీసు కానిస్టేబుల్లు సహదేవ్, ఆనంద్ పోలీసు కళా బృందం సభ్యులు డి.రాములు, బి.జగదీష్, శివరాములు, బాల్ రాజు ఏ.హెచ్.టి.యు సభ్యుడు వరప్రసాద్ తో పాటు గ్రామ పెద్దలు మరియు ప్రజలు  పాల్గొన్నారు.

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe