BB6 TELUGU NEWS CHANNEL
ఎల్పీజీ (LPG) సరఫరాలో అక్రమాలకు పాల్పడిన డిస్ట్రిబ్యూటర్లపై హెచ్‌పీసీఎల్ (HPCL) కఠిన చర్యలు తీసుకుంది. ఏకంగా 10 మంది డిస్ట్రిబ్యూటర్లను సస్పెండ్ చేసింది. వీరు బ్లాక్ మార్కెట్లో విక్రయించడం, అధిక ధరలు వసూలు చేయడం, గృహ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు మళ్లించడం వంటి మోసాలకు పాల్పడినట్లు తెలుస్తోంది.
దేశవ్యాప్తంగా ఎల్‌పీజీ సిలిండర్ల డెలివరీలో తీవ్ర జాప్యం జరుగుతున్న తరుణంలో, ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో ఏకంగా 10 మంది ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్లను సస్పెండ్ చేసింది. గ్యాస్ కొరతను సాకుగా చూపి బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడినా, సిలిండర్లను మళ్లించినా సహించేది లేదని ప్రభుత్వం గట్టి హెచ్చరిక పంపింది.
యుద్ధం తెచ్చిన సెగ . ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న ఈ గ్యాస్ సంక్షోభానికి ప్రధాన కారణం మధ్యప్రాచ్యంలో ముదురుతున్న యుద్ధమే. భారత్ తన ఎల్‌పీజీ అవసరాల్లో దాదాపు 90 శాతం మధ్యప్రాచ్యం నుంచే దిగుమతి చేసుకుంటుంది. ముఖ్యంగా హార్ముజ్ జలసంధి నుంచి వచ్చే షిప్పింగ్ మార్గాలు యుద్ధం వల్ల దెబ్బతిన్నాయి. దీంతో గొలుసుకట్టు సరఫరా వ్యవస్థ అస్తవ్యస్తమైంది. కొన్ని రాష్ట్రాల్లో సిలిండర్ బుక్ చేసిన తర్వాత ఇంటికి రావడానికి 10 రోజుల వరకు సమయం పడుతోంది. ఈ క్రమంలో కొత్త కనెక్షన్ల జారీని కూడా తాత్కాలికంగా నిలిపివేయడం గమనార్హం. ఈ పరిస్థితిపై పెట్రోలియం శాఖ కార్యదర్శి నీరజ్ మిత్తల్ రాష్ట్రాలకు పంపిన లేఖలో కీలక అంశాలను ప్రస్తావించారు.
“ప్రజల్లో భయాందోళనలు పెరగడం వల్ల అనవసరమైన కొనుగోళ్లు, నిల్వ చేయడం పెరుగుతున్నాయి. దీనివల్ల కృత్రిమ కొరత ఏర్పడుతోంది. అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన నిఘా ఉంచాలి. రోజువారీగా ప్రజలకు వాస్తవ పరిస్థితులను వివరించాలి.” అని సూచించారు.
అక్రమాలను సహించేది లేదు….
హెచ్‌పీసీఎల్ తీసుకున్న ఈ చర్య కేవలం ఆ 10 మంది డిస్ట్రిబ్యూటర్లకే పరిమితం కాదు, దేశవ్యాప్తంగా ఉన్న వేల మంది డీలర్లకు ఇదొక హెచ్చరిక. గృహ అవసరాలకు వాడాల్సిన సిలిండర్లను వాణిజ్య అవసరాలకు (Commercial) అధిక ధరలకు మళ్లిస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం గృహాలకే ప్రాధాన్యత ఇస్తోంది. కమర్షియల్ సిలిండర్ల సరఫరాపై కూడా ఆంక్షలు విధించారు.
వినియోగదారులు ఏం చేయాలి?
ప్రస్తుత సంక్షోభ సమయంలో ప్రజలు సంయమనం పాటించడం చాలా ముఖ్యం. యుద్ధం వల్ల ఏర్పడిన ఈ ఇబ్బందులు తాత్కాలికమే. అనవసరంగా భయపడి ఇంట్లో సిలిండర్లను నిల్వ ఉంచడం వల్ల నిజంగా అవసరమైన వారికి గ్యాస్ అందకుండా పోతుంది. ఎవరైనా డిస్ట్రిబ్యూటర్ అదనపు డబ్బులు అడిగినా లేదా అక్రమాలకు పాల్పడినా వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయండి.
బుకింగ్ వ్యవధి పెరిగింది
ఎల్పీజీ కొరత నేపథ్యంలో ప్రభుత్వం నగరాలు, పట్టణ ప్రాంతాల్లో సిలిండర్ బుకింగ్ వ్యవధిని 25 రోజులకు పెంచింది. గ్రామీణ ప్రాంతాల్లో అయితే 45 రోజులకు పెంచింది.
వంటగ్యాస్ వినియోగదారులకు షాక్! 10 మంది డిస్ట్రిబ్యూటర్ల సస్పెన్షన్.. అసలు ఏం జరుగుతోంది?
05
Apr