BB6 TELUGU NEWS CHANNEL
తెలంగాణ : Revanth Reddy మరో ఎన్నికల హామీ అమలు దిశగా అడుగులు వేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వరుసగా పథకాలను అమలు చేస్తూ వస్తున్న ప్రభుత్వం… ఇప్పుడు పెండింగ్‌లో ఉన్న రెండు కీలక హామీల అమలుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సహాయం, ప్రస్తుతం ఉన్న పింఛన్లను రూ.4,000కు పెంచే ప్రతిపాదనపై తుది కసరత్తు జరుగుతోంది. ఈ నెల 28న అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న 2026–27 వార్షిక బడ్జెట్లోనే దీనిపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం.
అసెంబ్లీ సమావేశాలు 26 నుంచి
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 26 నుంచి ప్రారంభం కానున్నాయి. 28న ప్రభుత్వం 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టనుంది. మొదటి రోజు రాష్ట్ర గవర్నర్ Jishnu Dev Varma ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. మరుసటి రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరగనుంది.
ఈసారి అసెంబ్లీ సమావేశాలను 10 నుంచి 15 రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. బడ్జెట్ రూపకల్పనపై ఇప్పటికే ముమ్మరంగా చర్చలు జరుగుతున్నాయి.
ప్రీ-బడ్జెట్ సమావేశాలు పూర్తి ఆర్థిక శాఖ మంత్రి Mallu Bhatti Vikramarka నేతృత్వంలో శాఖల వారీగా ప్రీ-బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యాయి. అన్ని శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో విస్తృతంగా సమీక్షలు నిర్వహించారు. ఈసారి బడ్జెట్లో సంక్షేమం, అభివృద్ధికి సమాన ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సంకేతాలు ఉన్నాయి.
రైతు సంక్షేమం, మహాలక్ష్మి, ఇందిరమ్మ ఇళ్లు, గృహజ్యోతి వంటి ఆరు గ్యారంటీల అమలుకు భారీగా నిధులు కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది. పెండింగ్ హామీల అమలు దిశగా
అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై దృష్టి సారించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.2,500 అందజేయడం, పింఛన్లను రూ.4,000కు పెంచడం వంటి కీలక నిర్ణయాలను బడ్జెట్లో ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.
అదేవిధంగా నీటిపారుదల, మౌలిక సదుపాయాలు, పట్టణాభివృద్ధి రంగాలకు కూడా ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సమాచారం. ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో పింఛన్ల పెంపుపై కీలక ప్రకటన వచ్చే అవకాశముందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
ఈ నెల 23న సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో బడ్జెట్ సెషన్‌పై అధికారిక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
సంక్రాంతి సమయంలోనే ఈ రెండు పథకాలపై ప్రకటన ఉంటుందని భావించినప్పటికీ ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆలస్యం జరిగింది. ఇక త్వరలో జరగనున్న జెడ్పీ ఎన్నికలు, అలాగే గ్రేటర్ హైదరాబాద్‌ను మూడు కార్పొరేషన్లుగా విభజించి నిర్వహించే స్థానిక ఎన్నికల నేపథ్యంలో… సంక్షేమ హామీల అమలుపై బడ్జెట్లో స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో 2026–27 బడ్జెట్‌పై రాజకీయంగా కూడా భారీ ఆసక్తి నెలకొంది.
తెలంగాణలో మహిళలకు రూ.2,500, పింఛన్లు రూ.4,000కి పెంపు?
19
Feb