శ్రీశైలంలో లభ్యమైన రాగి రేకుల శాసనాలు – అందులో రాసి ఉంది చదివి ఆశ్చర్యపోయిన పరిశోధకులు

2021లో శ్రీశైలంలో లభ్యమైన రాగి రేకుల శాసనాలు తోకచుక్కలు, ఉల్కాపాతాలకు సంబంధించిన విశేషాలను వెల్లడించాయి. 1456లో విజయనగర రాజు మల్లికార్జున తోకచుక్కల ప్రభావాన్ని నివారించేందుకు శ్రీశైలంలో శాంతి హోమం నిర్వహించారు. ఈ హోమంలో భాగస్వామ్యమైన వేద పండితుడు లింగనార్యకు సింగపుర గ్రామాన్ని దానం చేశారు.
నంద్యాల జిల్లాలోని శ్రీశైలంలో 2021లో లభ్యమైన రాగి రేకుల శాసనాలు ఆసక్తికర సమాచారాన్ని తెలియజేశాయి. భారత పురావస్తుశాఖ శాసనాల అధ్యయన విభాగం సంచాలకుడు మునిరత్నంరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఈ శాసనాల్లో తోకచుక్కలు, ఉల్కాపాతానికి సంబంధించిన విశేషాలు ఉండటాన్ని గుర్తించారు. ప్రతి 72–80 ఏళ్లలో భారీ సంఖ్యలో ప్రకాశవంతమైన తోకచుక్కలు పడడం, ఉల్కాపాతాలు సంభవించడం సాధారణమని శాసనాలు సూచిస్తున్నాయి. పురాతన కాలంలో ఈ ప్రకృతి సంఘటనలపై విపత్తుల భయం ఉండేదట. 1456లో విజయనగర రాజ్యంలో తోకచుక్కలు పడతాయన్న అంచనాలు భయాందోళనలకు దారితీశాయి.

ఆ సమయంలో విజయనగర రాజు మల్లికార్జున, తోకచుక్కల ప్రభావాన్ని నివారించేందుకు శ్రీశైలంలో భారీ స్థాయిలో శాంతి హోమం నిర్వహించారు. ఈ పూజలు విజయవంతమయ్యాయని విశ్వసించిన రాజు.. తన సామ్రాజ్యంలో తోకచుక్కల ప్రభావం లేకపోవడం పట్ల సంతృప్తి చెందాడు. శాంతి హోమంలో ముఖ్యపాత్ర పోషించిన లింగనార్య అనే వేద పండితుడికి, రాజు సింగపుర అనే గ్రామాన్ని దానం ఇచ్చారు. లింగనార్య ఖగోళశాస్త్రంలో ప్రావీణ్యం ఉన్న వేద పండితుడని శాసనాలు తెలియజేస్తున్నాయి.

రాజు మల్లికార్జున ఈ విశేషాలను సంస్కృతం, నాగరి భాషల్లో రాగి రేకులపై శాసనాలుగా రాయించారని అధికారులు తెలిపారు. 2021లో వెలుగుచూసిన ఈ రాగి శాసనాలు పురాతన ఖగోళ విజ్ఞానాన్ని తెలియజేస్తున్నాయి. ఈ వివరాలు విజయనగర సామ్రాజ్యంలో ఖగోళచరిత్ర, ఆధ్యాత్మిక చర్యల ప్రాముఖ్యతను చాటిచెబుతున్నాయి.

Related News

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe