ఉచితాలతో రాష్ట్రం దివాళా దిశగా? – హైకోర్టు, సుప్రీంకోర్టు ఆందోళన

*కోటీశ్వరులకు రైతుబంధు ఎందుకు?*

*లగ్జరీ బైక్‌లు వాడేవారికి రీయింబర్స్‌మెంట్‌ ఎందుకు?*

*ఉచిత పథకాలతో త్వరలో ప్రమాదకర పరిస్థితులు*

*రాష్ట్ర జనాభాకు మించి తెల్ల రేషన్‌ కార్డుదారులు*

*ఉచితాలతో జనం పనికి వెళ్లడం మానేశారు*

*వ్యవసాయ కూలీలు దొరక్క రైతులు ఏడుస్తున్నారు*

*ఖజానాలో డబ్బు లేకపోతే అధికారి ఏం చేస్తారు?*

*రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు చురకలు*

*ధిక్కరణ కేసులో సందీప్‌ సుల్తానియా కోర్టుకు హాజరు*

BB6 TELUGU NEWS CHANNEL
ఉచిత పథకాలతో త్వరలో రాష్ట్రంలో చాలా ప్రమాదకర పరిస్థితులు ఏర్పడతాయని హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. కోటీశ్వరులకు రైతుబంధు, లగ్జరీ బైక్‌లపై తిరిగే వారికి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఎందుకని జస్టిస్‌ నగేశ్‌ భీమపాక వ్యాఖ్యానించారు. స్టాంప్‌ డ్యూటీపై కంటోన్మెంట్‌ బోర్డు నుంచి వసూలు చేసిన సర్‌ఛార్జిని తిరిగి చెల్లించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ కంటోన్మెంట్‌ బోర్డు మెంబర్‌గా వ్యవహరించిన జె.రామకృష్ణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఇటీవల విచారణ చేపట్టిన హైకోర్టు సర్‌ఛార్జి తిరిగి చెల్లించాలని ప్రభుత్వాన్నిఆదేశించింది. కోర్టు ఆదేశాలు అమలు కాకపోవడంతో పిటిషనర్‌ జె.రామకృష్ణ హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ కేసులో ప్రతివాదిగా ఉన్న ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్‌ సుల్తానియాకు పలుమార్లు నోటీసు ఇచ్చినప్పటికీ అఫిడవిట్‌ దాఖలు చేయకపోవడంతో పాటు ప్రత్యక్ష హాజరు నుంచి మినహాయింపు కోరకుండానే గైర్హాజరు కావడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనపై కొద్ది రోజుల క్రితం బెయిలబుల్‌ వారంట్‌ జారీ చేసింది. వారంట్‌ అమలు చేయాలని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసింది. రూ.5 వేల విలువకు వ్యక్తిగత బాండ్‌ ఇస్తేనే బెయిల్‌ ఇవ్వాలని పేర్కొంది.*

*🌀కోర్టు హాజరవుతానన్న హామీతో పూచీకత్తు తీసుకుని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియాకు బెయిల్‌ మంజూరు చేశారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఉదయం 10.30 గంటలకు సుల్తానియా జస్టిస్‌ నగేశ్‌ భీమపాక ధర్మాసనం ఎదుట హాజరయ్యారు. ఈ సందర్భంగా సుల్తానియా వివరణ ఇస్తూ.. పిటిషనర్‌కు చెల్లించాల్సిన మొత్తంలో రూ.25.45 కోట్లు ఇచ్చేశామన్నారు. మిగతా మొత్తాన్ని వాయిదాల రూపంలో చెల్లిస్తామని చెప్పారు. ఈ చెల్లింపు వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేస్తామని కోర్టుకు నివేదించారు. హైకోర్టు ఉత్తర్వులను అమలు చేస్తూ ప్రభుత్వం చెల్లింపులు చేసిన నేపథ్యంలో సంతృప్తి చెందిన ధర్మాసనం.. సందీప్ కుమార్‌ సుల్తానియాకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చింది. ఈ సందర్భంగా ఆర్థిక శాఖ వద్ద నిధులు లేకపోవడానికి ఉచిత పథకాలే కారణమని జస్టిస్‌ నగేశ్‌ భీమపాక అభిప్రాయపడ్డారు. తాను ప్రభుత్వానికి లేదా మరెవ్వరికీ వ్యతిరేకంగా మాట్లాడటం లేదని చెప్పారు. ‘‘కూలీలు దొరకక గ్రామాల్లో రైతులు ఏడుస్తున్నారు. ఎవ్వరూ పనికి వెళ్లడం లేదు. ప్రజలు ఒకప్పుడు పనులు చేసుకునే వారట అని మనం వీడియోల్లో చూసుకోవాల్సి వస్తుంది. ఖజానాలో నిధులు లేనప్పుడు ఎవరు మాత్రం ఏంచేస్తారు? ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి స్థానంలో ఎవరున్నా ఏమీ చేయలేరు. ఆయనపై వెయ్యి కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నాయి. ఈ లెక్కన ఆయన జీవితాంతం జైల్లో ఉండాల్సి వస్తుంది. ప్రత్యక్ష హాజరుకు ఆదేశించడం బాధాకరమే.. కానీ, కోర్టు ఉత్తర్వుల అమలుకు తప్పదు’’ అని జడ్జి వ్యాఖ్యానించారు. ‘‘రాష్ట్రంలో 1.05 కోట్ల తెల్లరేషన్‌ కార్డులు ఉండటం ఏంటి? రాష్ట్ర జనాభా కన్నా ఎక్కువ మంది తెల్లరేషన్‌ కార్డుల్లో కుటుంబ సభ్యులుగా ఉన్నారు’’ అన్నారు. మా ఊరికి ఏం పనులు చేస్తారు అని అడిగే పరిస్థితి నుంచి నాకు ఏం పథకాలు వస్తున్నాయి ? అని అడిగే పరిస్థితికి వచ్చేశామని వ్యాఖ్యానించారు. తదుపరి విచారణ ఈ నెల 19కి వాయిదా వేశారు.