ఒకే ఆధార్‌..’ రెండు జీతాలు..కొందరు ప్రభుత్వ ఉద్యోగుల మాయాజాలం

ఒకే ఆధార్‌..’ రెండు జీతాలు..
కొందరు ప్రభుత్వ ఉద్యోగుల మాయాజాలం
ఆన్‌లైన్‌లో వివరాల నమోదుతో బహిర్గతం
తీవ్ర ఆర్థిక అవకతవకలుగా గుర్తించి కఠిన చర్యలకు ఆదేశాలు..

BB6 TELUGU NEWS CHANNEL
కొందరు ప్రభుత్వ ఉద్యోగులు ఒకటి కంటే ఎక్కువ ప్రభుత్వ విభాగాల నుంచి జీతం లేదా పారితోషికం పొందినట్లు ఆర్థికశాఖ అంతర్గత విచారణలో తేలింది. గత ఆరు నెలలుగా ఉద్యోగుల ఆధార్, పాన్‌ వివరాలను ‘సమగ్ర ఆర్థిక నిర్వహణ సమాచార వ్యవస్థ’ (ఇంటిగ్రేటెడ్‌ ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ ఇన్‌ఫర్మేషన్‌ సిస్టం-ఐఎఫ్‌ఎంఐఎస్‌) అన్ని శాఖలు అప్‌లోడ్‌ చేసేలా ఆర్థికశాఖ చర్యలు తీసుకుంది. ఇలా వచ్చిన సమాచారంలో.. ఎవరైనా ఉద్యోగి పేరుతో ఒకే ఆధార్‌ సంఖ్య రెండుసార్లు (డూప్లికేషన్‌) ఉందా అనేది నిర్ధారించడానికి సాఫ్ట్‌వేర్‌ ద్వారా తనిఖీ చేస్తే విస్తుగొలిపే వాస్తవాలు బయటపడ్డాయి. రెండు వేర్వేరు పేర్లతో ఉన్న ఉద్యోగులు కొంతకాలంగా ఒకే ఆధార్‌ నంబరుతో రెండేసి వేతనాలను వేర్వేరు విభాగాల నుంచి తీసుకుంటున్నారు. కొన్ని శాఖల్లో ఉద్యోగి ఒకే పేరుతో ఉన్నా.. ఆధార్‌ ఇచ్చి ఒకచోట, ఇవ్వకుండా మరోచోట వేతనం తీసుకున్నారు.*

రెవెన్యూ, పోలీసు శాఖలో…

*ఉదాహరణకు ఒక మహిళా ఉద్యోగి ఒకే పేరుతో ఏప్రిల్‌ నెలలో రెవెన్యూశాఖలో ఆధార్‌ నంబరు ఇచ్చి రూ.2.09 లక్షలు, పోలీసుశాఖలో ఆధార్‌ వివరాలు ఇవ్వకుండా రూ.1.59 లక్షల వేతనం తీసుకున్నారు. ఇలా ఎలా సాధ్యమైందని రెండుశాఖల డ్రాయింగ్‌ అధికారులను ఆర్థికశాఖ వివరణ అడిగింది. ఇలాగే విద్యాశాఖలో ఇద్దరు ఉద్యోగులు ఒకే ఆధార్‌ నంబరుతో వేతనాలు తీసుకున్నారు. ఇలా అన్ని శాఖల్లో ఇప్పటివరకు 40 మంది ఉద్యోగులను గుర్తించారు. మరింత లోతైన పరిశీలన కొనసాగుతోంది. వీరు కావాలనే ప్రభుత్వాన్ని మోసం చేసి ఇలా రెండేసి వేతనాలు తీసుకుంటున్నారా.. లేక పొరపాటున ఆధార్‌ వివరాలను నమోదు చేశారా అనే దానిపై సమగ్ర విచారణ చేయాలని అన్ని ప్రభుత్వ శాఖలను ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీలు, ఇతర ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న రెగ్యులర్‌ ఉద్యోగులు, గ్రాంట్‌-ఇన్‌-ఎయిడ్, తాత్కాలిక సిబ్బంది సహా ప్రతి ఒక్కరి ఆధార్, ఇతర వ్యక్తిగత, ఉద్యోగ వివరాలను పోర్టల్‌ ద్వారా ధ్రువీకరించాలని నిర్దేశించారు.*

బాధ్యులపై క్రిమినల్‌ కేసులు

*ఒకటికి మించి ప్రభుత్వ విభాగాల నుంచి మోసపూరితంగా జీతం లేదా పారితోషికం పొందిన వారి కేసులను తీవ్రమైన ఆర్థిక అవకతవకలుగా పరిగణించి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. నకిలీ పత్రాలు సృష్టించడం, అధికారిక రికార్డులను తప్పుగా చూపించడం, నేరపూరిత విశ్వాస భంగం, ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేయడం వంటి నేరాలకు పాల్పడినట్లు కేసులు నమోదు చేయాలి. ఎవరైనా ఉద్యోగి వాస్తవాలను దాచిపెట్టి, తప్పుడు సమాచారం ఇచ్చారా అనే కోణంలో విచారణ చేయాలి. మోసపూరిత చర్యలకు పాల్పడినట్లు రుజువైతే తెలంగాణ సివిల్‌ సర్వీసెస్‌ నియమావళి ప్రకారం చర్యలు తీసుకోవాలి. అక్రమంగా డ్రా చేసిన ప్రభుత్వ ధనాన్ని తిరిగి రాబట్టి క్రిమినల్‌ కేసు నమోదు చేయాలి. ఇలా మోసపూరితంగా రెండేసి వేతనాలు డ్రా చేయడం వెనక.. ఎవరిదైనా నిర్లక్ష్యం, లోపం ఉన్నాయా.. లేదా ఉద్యోగులతో కుమ్మక్కయ్యారా అనేది గుర్తించి సంబంధిత అధికారులందరిపై చర్యలు తీసుకోవాలి. ఈ కేసులపై విచారణ వివరాలతో నివేదికను ఏడు రోజులలోపు ఆర్థికశాఖకు సమర్పించాలి’’ అని సీఎస్‌ ఆదేశించారు.